President Election: ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.. భారీగా క్రాస్ ఓటింగ్..

President Election: రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది.. దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.. అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది.. చాలా రాష్ట్రాల్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా సమాచారం అందుతోంది.. మెజారిటీ ఓట్లన్నీ ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకే పడినట్లుగా తెలుస్తోంది.. ఒడిశా, అసోం, హర్యానా, మధ్యప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్ సభ్యులు ద్రౌపది ముర్ముకు ఓటు వేసినట్లుగా సమాచారం.. అదే సమయంలో కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఓటు వేసినట్లుగా వార్తలొస్తున్నాయి..
బెంగాల్‌లో 9 మంది బీజేపీ ఎమ్మెల్యేలు యశ్వంత్ సిన్హాకు ఓటు వేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇక గుజరాత్‌లో ఎన్సీ ఎమ్మెల్యే ఓటు ముర్ముకే పడినట్లుగా తెలుస్తోంది. యూపీలో యశ్వంత్ సిన్హాను కాదని సమాజ్‌వాదీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కొందరు ద్రౌపది ముర్ముకు ఓటు ద్వారా మద్దతు తెలిపారని అక్కడి వర్గాలంటున్నాయి.. తాజా లెక్కల ప్రకారం 60 శాతానికిపైగా మెజారిటీతో ముర్ము గెలుపు ఖయంగా కనబడుతోంది..
పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటింగ్ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించనుంది.. పార్లమెంటులో మొదట ప్రధాని నరేంద్ర మోదీ ఓటు హక్కు వినియోగించుకోగా.. ఆ తర్వాత కేంద్ర మంత్రులు, ఎంపీలు ఓటు వేశారు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ సహా ఎంపీలంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీల్ చైర్‌లో వచ్చి ఓటు వేశారు.. మెజారిటీ తెలుగు ఎంపీలు కూడా పార్లమెంటులోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.. ఇక ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ పూర్తిస్థాయిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎమ్మెల్యేలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com