WAQF BILL: వక్ఫ్‌ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

WAQF BILL: వక్ఫ్‌ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
X
చట్టంగా మారిన వక్ఫ్ బిల్లు.. ముస్లింలకు వ్యతిరేకం కాదన్న కేంద్రం

వక్ఫ్‌ సవరణ బిల్లు-2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో వక్ఫ్‌ బిల్లు చట్టంగా మారింది. ఇటీవల ఈ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. వక్ఫ్‌ బిల్లుపై బుధవారం లోక్‌సభలో 14 గంటలకు పైగా చర్చ జరిగింది. అనంతరం సవరణల వారీగా ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహించగా.. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటేశారు. రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్పష్టం చేశారు.

బిల్లులో ఏముంది..?

రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో కనీసం ఇద్దరు ముస్లింయేతర సభ్యులను చేర్చాలని బిల్లు ఆదేశిస్తుంది. ఇది వక్ఫ్ బోర్డుల మతపరమైన స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుందని.. మైనారిటీ సంస్థలకు రాజ్యాంగ రక్షణలను ఉల్లంఘిస్తుందని ముస్లింలు వాదిస్తున్నారు. వివాదాస్పద వక్ఫ్ ఆస్తుల యాజమాన్యాన్ని నిర్ణయించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ఇస్తాయి. వక్ఫ్ బోర్డులు తమ ఆస్తులకు సంబంధించిన ఆస్తి పత్రాలను సమర్పించాలని బిల్లు ఆదేశిస్తుంది. దీని ప్రకారం వక్ఫ్ ఆస్తులకు పూర్తి డాక్యుమెంటనేషన్ తప్పనిసరి. కానీ వారసత్వంగా ఉన్న ముస్లింల ఆస్తులకి పాత రికార్డులు ఎక్కడ ఉంటాయనే ప్రశ్న తలెత్తుతోంది. సర్వే అధికారాలు కలెక్టర్లకు మారిపోవడంతో భూమి ఆక్రమణలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముస్లిం నేతలు ఆరోపిస్తున్నారు.

ఆరోపణల పర్వం

ముస్లిం సమాజానికి చెందిన ధార్మిక, దాతృత్వ ఆస్తుల నిర్వహణ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా నిర్వహించేందుకు వక్ఫ్ సవరణ బిల్లు ఉపయోగపడుతుందని కేంద్రం చెబుతోంది. వక్ఫ్ ఆస్తులను అనధికారికంగా ఆక్రమించడాన్ని నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవచ్చని అంటోంది. కానీ, కేంద్రం తీసుకొచ్చిన బిల్లుపై ముస్లిం సమాజం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

టీడీపీలో రాజీనామాలు

పార్లమెంట్ లో కేంద్రం తాజాగా ప్రవేశపెట్టి ఆమోదించిన వక్ఫ్ బిల్లుకు ఎన్డీయే మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ, లోక్ జన్ శక్తి వంటి పార్టీలు మద్దతుగా నిలిచాయి. దీంతో పార్లమెంట్ లోని లోక్ సభ, రాజ్యసభల్లోనూ ఈ వివాదాస్పద బిల్లు సునాయాసంగా గట్టెక్కింది. అయితే ఈ బిల్లుకు మద్దతుగా నిలిచిన ఎన్డీయే మిత్రపక్షాలకు ఇప్పుడు సొంత పార్టీల్లో తలనొప్పులు తప్పడం లేదు. ఇప్పటికే బీహార్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు మైనార్టీ నేతలు గుడ్ బై చెప్తుండగా.. ఇప్పుడు ఏపీలోనూ టీడీపీకి ఇవాళ ఓ మైనార్టీ నేత గుడ్ బై చెప్పేశారు. గత ఎన్నికల్లో విజయవాడలో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని గెలుపు కోసం పనిచేసిన వాజిద్ ఖాన్ అనే మైనార్టీ నేత ఇవాళ పార్టీకి రాజీనామా చేశారు. గతంలో చంద్రబాబు పాలనా దీక్షను చూసి తాను టీడీపీలో చేరానని, గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విజయం కోసం పనిచేశానని వాజిద్ ఖాన్ తన రాజీనామా లేఖలో తెలిపారు. కానీ ఇప్పుడు పార్లమెంట్లో వక్ఫ్ బిల్లుకు టీడీపీ మద్దతునివ్వడం తనను మనస్తాపానికి గురి చేసినట్లు ఆయన తెలిపారు.

Tags

Next Story