Droupadi Murmu: ద్రౌపది ముర్ముకు తప్పిన ప్రమాదం..కొచ్చి స్టేడియంలో బురదలో కూరుకుపోయిన హెలికాప్టర్

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేరళ పర్యటనలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో బురదలో కూరుకుపోవడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే, భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తేవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళితే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాలుగు రోజుల పర్యటన నిమిత్తం కేరళలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ ఆమె శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవాల్సి ఉంది. ఇందుకోసం కొచ్చిలోని ప్రమదం స్టేడియానికి హెలికాప్టర్‌లో చేరుకున్నారు. అయితే, హెలికాప్టర్ ల్యాండ్ అయిన సమయంలో దాని టైర్లు ఒకవైపు బురదలో పూర్తిగా దిగబడిపోయాయి.
దీంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో హెలికాప్టర్‌ను అతి కష్టం మీద బురద నుంచి బయటకు నెట్టి సురక్షిత ప్రదేశానికి చేర్చారు. ఈ అనూహ్య ఘటనతో షెడ్యూల్ కొద్దిసేపు నిలిచిపోయింది. అనంతరం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్కడి నుంచి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. ఈ ఘటనతో అధికారులు భద్రతా ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com