PRESIDENT: "శాంతి" చట్టానికి రాష్ట్రపతి ఆమోదం

భారతదేశ ఇంధన రంగంలో సరికొత్త శకం ఆరంభమైంది. దేశ పౌర అణు రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తూ, ప్రైవేటు భాగస్వామ్యానికి పెద్దపీట వేసే 'సస్టెయినబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా' (SHANTI) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. శనివారం (డిసెంబర్ 20, 2025) వెలువడిన కేంద్ర నోటిఫికేషన్తో ఈ చట్టం అధికారికంగా అమలులోకి వచ్చింది.
ప్రైవేటు రంగానికి ద్వారాలు క్లోజ్ కాదు.. ఓపెన్!
దేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని వీడుతూ, అణు విద్యుత్ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడం ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. దీనివల్ల దేశం 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని చేరుకోవాలనే లక్ష్యం దిశగా వేగంగా అడుగులు వేయనుంది.
పాత చట్టాలకు స్వస్తి.. కొత్త వ్యవస్థకు నాంది
ఈ నూతన చట్టం అమలుతో 63 ఏళ్ల నాటి అణుశక్తి చట్టం (1962) మరియు వివాదాస్పదంగా మారిన అణు బాధ్యత చట్టం (2010) రద్దయ్యాయి. ఈ పాత చట్టాలు అణు రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు, విదేశీ సాంకేతికతకు పెద్ద అడ్డంకిగా మారాయని ప్రభుత్వం భావించింది. ముఖ్యంగా విదేశీ సరఫరాదారులపై ఉన్న అపరిమిత బాధ్యత క్లాజులను సవరించి, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేశారు.
ప్రైవేటు రంగానికి దక్కే అధికారాలు
నిర్మాణం మరియు నిర్వహణ: టాటా పవర్, అదానీ గ్రూప్, ఎల్‌అండ్‌టీ వంటి దిగ్గజ ప్రైవేటు కంపెనీలు ఇప్పుడు సొంతంగా లేదా జాయింట్ వెంచర్ల ద్వారా అణు విద్యుత్ ప్లాంట్లను నిర్మించవచ్చు.
యాజమాన్య హక్కులు: ప్లాంట్లను సొంతం చేసుకోవడం, నిర్వహించడం, చివరకు వాటిని తొలగించే అధికారం కూడా కంపెనీలకు ఉంటుంది.
అణు ప్రాజెక్టులలో ప్రైవేటు మరియు విదేశీ పెట్టుబడులకు 49 శాతం వరకు అనుమతి లభించే అవకాశం ఉంది.
నియంత్రణ మాత్రం కేంద్రానిదే..
పౌర అణు రంగాన్ని ప్రైవేటుకు అప్పగించిన, దేశ భద్రత దృష్ట్యా కీలకమైన అంశాలను కేంద్రం తన వద్దే ఉంచుకుంది. యురేనియం, థోరియం తవ్వకాలు: ఖనిజ అన్వేషణ, తవ్వకాలు ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి. ఐసోటోపిక్ విభజన, ఇంధన శుద్ధి కేంద్రం నియంత్రణలో ఉంటాయి. వ్యర్థాల నిర్వహణ: రేడియోధార్మిక వ్యర్థాల నిర్మూలన బాధ్యత ప్రభుత్వం వహిస్తుంది. అణు ఇంధన నియంత్రణ మండలికి (AERB) చట్టబద్ధమైన హోదా కల్పించి, భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించేలా బలోపేతం చేశారు. భారతదేశం ప్రస్తుతం కేవలం 8 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉంది (మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో ఇది కేవలం 3 శాతమే). అయితే ఏఐ (AI), డేటా సెంటర్లు, సెమీకండక్టర్ తయారీ వంటి అత్యాధునిక రంగాలకు నిరంతర విద్యుత్ అవసరం. సౌర, పవన విద్యుత్తులో హెచ్చుతగ్గులు ఉంటాయి కాబట్టి, 'బేస్ లోడ్' ఇంధనంగా అణు విద్యుత్ కీలకం. 2070 నాటికి 'నెట్ జీరో' లక్ష్యాన్ని చేరాలంటే బొగ్గుపై ఆధారపడటం తగ్గించి అణుశక్తిని పెంచుకోవడమే సరైన మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ బిల్లు ద్వారా యువతకు పరిశోధన, ఇంజనీరింగ్ విభాగాల్లో వేలాది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు భారత్ ఒక 'న్యూక్లియర్ హబ్'గా మారడానికి ఈ 'శాంతి' చట్టం పునాది వేయనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

