తాగి, వాగి కటకటాలపాలయ్యాడు

తాగి, వాగి కటకటాలపాలయ్యాడు
X
30 ఏళ్ల క్రితం మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

మందు తాగితే నిజాలు కక్కేస్తారంటే ఏదో అనుకున్నాం. ఆ నిజాలు కొన్ని స్నేహితుల మధ్య చిచ్చు పెడతాయని కూడా మనకి తెలుసు కానీ తాగి వాగి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు ఒక మహానుభావుడు. అటునుంచి జైలుకి వెళ్లినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతను తాగి వాగినది తను 30 ఏళ్ల క్రితం చేసిన మర్డర్ గురించి.

లోనావాలాకు చెందిన అవినాష్ పవార్ అనే వ్యక్తి ఒక చిన్న షాప్ పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. షాప్ పక్కనే ఒక వృద్ధ జంటకి అప్పుడప్పుడు సహాయం చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. 1993లో అదే వృద్ధ జంటను హత్యచేసి.. ఇంట్లో ఉన్న నగదు, బంగారం, విలువైన కొన్ని వస్తువులను దోచుకున్నాడు. 19 సంవత్సరాల వయసులో ఇద్దరు సహచరులతో కలిసి ఈ ప్లాన్ చేసాడు.పోలీసు విచారణలో సహాయం చేసిన ఇద్దరు వ్యక్తులు పట్టుబడగా. అవినాష్ మాత్రం తన తల్లిని అక్కడే విడిచిపెట్టి ఢిల్లీ పారిపోయాడు. తర్వాత ఔరంగాబాద్ చేరుకుని అక్కడ అమిత్ పవార్ గా పేరు మార్చుకున్నాడు. అక్కడ నుండి పింప్రి-చించ్వాడ్, అహ్మద్ నగర్ అటునుంచి చివరికి ముంబై చేరుకొని అక్కడే సెటిల్ అయ్యాడు. ఆధార్ కార్డులో కూడా పేరు మార్చుకున్నాడు. డ్రైవింగ్ లైసెన్స్ కూడా సంపాదించుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం పవార్ వయసు 49 ఏళ్ళు. ఈ ముప్పై ఏళ్లలో అతను ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 30 ఏళ్ళు కింగ్ లా బ్రతికాడు.

అయితే నిజాన్ని ఎక్కువ కాలం దాచలేము. అక్కడో ఇక్కడో, ఎక్కడో ఒక దగ్గర బయటపడిపోతుంది. తప్పు చేసినవాడు ఎప్పటికైనా దొరికి తీరతాడు అన్నది అమిత్ అలియాస్ అవినాష్ విషయంలో నిజమైంది.

ఓ పార్టీకి వెళ్లి ఫుల్లుగా తాగి మందు మైకంలో అప్పుడు చేసిన మర్డర్ గురించి ఒక అజ్ఞాతవ్యక్తి దగ్గర వాగి దొరికిపోయాడు. ఆ వ్యక్తి నుండి సమాచారం అందుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ స్వయంగా రంగంలోకి దిగి పవార్ ను అరెస్టు చేశారు. 30 ఏళ్ల క్రితం జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ పవార్ అలియాస్ అమిత్ పవార్ కోసం ఇప్పటికీ గాలిస్తూనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అప్పట్లోనే అతడి ఇద్దరు సహచరులు పట్టుబడినా ఇతను మాత్రం తప్పించుకున్నాడని, ఇన్నాళ్లుగా పవార్ తన తల్లిని చూడటానికి కూడా రాలేదని పోలీసులు చెబుతున్నారు.

Tags

Next Story