Surat Building: ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్ ను ప్రారంభించిన మోదీ..

గుజరాత్‌లోని సూరత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయమైన డైమండ్ బోర్స్-SDBను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అమెరికాలోని పెంటగాన్‌ను వెనక్కి నెట్టిన ఈ భవనాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక హంగులతో నిర్మించారు. పూర్తి స్థాయి హరిత భవనంగా రూపొందిన ఈ కార్యాలయం గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయంగా ఏర్పాటైన సూరత్ డైమండ్ బోర్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇప్పటివరకూ ప్రపంచంలో అతిపెద్ద కార్యాలయంగా గుర్తింపు పొందిన అమెరికాలోని పెంటగాన్‌ను ఇది వెనక్కినెట్టింది. పెంటగాన్ కన్న ఎక్కువ విస్తీర్ణంలో దీన్ని గుజరాత్ ప్రభుత్వం నిర్మించింది. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వజ్రాల వ్యాపారంలో సూరత్‌కు గుర్తింపు ఉంది. ప్రపంచంలోని సుమారు 90 శాతం వజ్రాలకు సానపెట్టడం వాటికి పాలిష్ చేయడం వంటివి సూరత్‌లోనే జరుగుతాయి. ఈ వ్యాపారం మరింత విస్తరించేందుకు ఈ SDB తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
సూరత్ సమీపంలోని ఖజోడ్ గ్రామంలో ఉన్న సూరత్ డైమండ్ బోర్స్-SDBని 3 వేల400 కోట్ల వ్యయంతో 67లక్షల 28 వేల 604 చదరపు అడుగుల విస్తీర్ణంలో పూర్తి హరిత భవనంగా నిర్మించారు. దాదాపు ముప్పై ఐదున్నర ఎకరాల్లో ఈ కార్యాలయం విస్తరించి ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక హంగులతో నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఎస్‌డీబీలో 20 అంతస్తుల చొప్పున 9 టవర్లను నిర్మించారు. ఇందులో మొత్తం 4,500 కార్యాలయాలు ఉంటాయి.
ప్రధాన ద్వారం నుంచి కేవలం 5 నిమిషాల్లోనే భవంతిలోని ఏ కార్యాలయానికైనా చేరుకోవచ్చు. SDB నిర్మాణం కోసం 46 వేల టన్నుల ఉక్కును వినియోగించారు. అధునాతన అగ్నిమాపక సదుపాయాలతో దీన్ని నిర్మించారు. ఈ కార్యాలయంలో మొత్తం 128 లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. 18 సెకన్లలోనే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 16వ అంతస్తుకు చేరుకునే వేగం వీటి ప్రత్యేకత. ఎస్‌డీబీ అవసరాల కోసం ఒక్క రోజుకు 18 లక్షల లీటర్ల నీటిని శుద్ధి చేయగల సామర్థ్యంతో నీటి శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు.
డైమండ్ కట్టర్లు, మెరుగుపెట్టేవారు, వ్యాపారులతో సహా మొత్తం 65 వేల మంది వజ్రాల నిపుణులు ఈ SDB కేంద్రంగా పనిచేయనున్నారు. ఈ అతిపెద్ద కార్యాలయం ప్రపంచవ్యాప్తంగా డైమండ్ కట్టింగ్ కేంద్రంగా సూరత్ పేరును సుస్థిరం చేయనుంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com