పాశ్వాన్‌కు నివాళులు అర్పించిన ప్రధాని నరేంద్రమోదీ

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న LJP అధినేత, కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తుదిశ్వాస విడిచారు. పాశ్వాన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షాలతోపాటు పలువురు కేంద్రమంత్రులు పాశ్వాన్ పార్ధీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. సుదీర్ఘరాజకీయ అనుభవం ఉన్న నేతను కోల్పోయామని, పాశ్వాన్ మృతి వ్యక్తిగతంగా తనకు తీరని లోటని ప్రధాని మోదీ అన్నారు. దేశం దూరదృష్టి గల నాయకుడిని కోల్పోయిందని.. పార్లమెంటులో అత్యంత చురుకైన, ఎక్కువ కాలం పనిచేసిన పాశ్వాన్ బడుగు, బలహీన వర్గాల గొంతుకగా నిలిచారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొనియాడారు.
లోక్‌జన్‌శక్తి పార్టీ వ్యస్థాపకుడైన రాంవిలాస్ పాశ్వాన్ ఎనిమిదిసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీహార్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మోదీ కేబినెట్‌లో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. దేశంలో కీలక దళిత నేతగా మంచి గుర్తింపు పొందారు. ఆయన కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు... ఇటీవల గుండె శస్త్రచికిత్స జరిగిన తర్వాత మరిన్ని సమస్యలు తలెత్తాయి.
1946 జులై 5న బీహార్‌లోని ఖగారియా జిల్లా షాహర్‌బన్నీలో ఓ దళిత కుటుంబంలో జన్మించిన పాశ్వాన్ కోసి కళాశాలలో డిగ్రీ చేశారు. అనంతరం పట్నా వర్సిటీలో పీజీ చేశారు. 1969లో ఆయన డీఎస్పీగా ఎంపికయ్యారు. 1969లో సంయుక్త సోషలిస్ట్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి దాదాపు ఐదు దశాబ్దాలుగా రాజకీయాల్లోనే కొనసాగారు. వీపీ సింగ్, దేవెగౌడ, ఐకే గుజ్రాల్ హాయాంలో మంత్రిగా పనిచేశారు. వాజ్‌పేయీ నేతృత్వంలోని ప్రభుత్వంలో కూడా మంత్రిగా సేవలందించారు. 1974లో లోక్‌దళ్ స్థాపించాక ఆ పార్టీలో చేరారు. 1975లో ఎమర్జెన్సీని వ్యతిరేకించి జైలుకు వెళ్లి వచ్చిన ఆయన 1977లోఅత్యధిక మెజార్టీతో గెలిచి ప్రపంచ రికార్డు సృష్టించారు. అనంతరం 2000లో లోక్‌జన్‌శక్తి పార్టీని స్థాపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com