తెలుగు ముఖ్యమంత్రులకు ప్రధాని ఫోన్

వర్ష విలయంలో చిక్కుకున్న తెలంగాణ ప్రజలకు దేశమంతా అండగా నిలుస్తుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు.. గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి మాట్లాడిన రాష్ట్రపతి.. ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలుసుకున్నారు.. ప్రాణనష్టంపై సంతాపం వ్యక్తం చేశారు. సహాయక చర్యలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని రాష్ట్రపతికి గవర్నర్, సీఎం కేసీఆర్ వివరించినట్లుగా తెలుస్తోంది..
భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన తెలుగు రాష్ట్రాలకు అన్ని విధాలుగా సాయం చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. తెలుగు ముఖ్యమంత్రులకు ప్రధాని ఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వర్షాలు, వరద మిగిల్చిన నష్టంతోపాటు, సహాయక చర్యలపైనా ప్రధానికి వివరాలు అందించారు.. పూడ్చలేని నష్టం వాటిల్లిందని, రాష్ట్రాలను ఆదుకోవాలంటూ ఏపీ, తెలంగాణ సీఎంలు ప్రధానిని కోరారు. అయితే, వరద, పునరావాస చర్యల్లో కేంద్రం తెలుగు రాష్ట్రాల వెన్నంటే ఉంటుందని మోదీ చెప్పారు. ఈ సంక్షోభం నుంచి రెండు రాష్ట్రాలూ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
వరద బాధిత తెలుగు రాష్ట్రాలకు అండగా ఉంటామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా చెప్పారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. సహాయక చర్యల కోసం అవసరమైతే కేంద్ర బలగాలను రంగంలోకి దించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సంపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com