PM Narendra Modi : అగ్గి రాజేసిన ప్రధాని మోదీ ప్రసంగం..

PM Narendra Modi : అగ్గి రాజేసిన ప్రధాని మోదీ ప్రసంగం..
PM Narendra Modi : ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది.

PM Narendra Modi : 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. అవినీతి, వారసత్వం అనే చెదపురుగులు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయని, వాటిని జనజీవనం నుంచి తరిమేద్దామని మోదీ పిలుపునిచ్చారు. అవినీతిని నిర్మూలిస్తేనే సామాన్యుల జీవితాలు బాగుపడతాయన్న ప్రధాని.. అవినీతిపరులను క్షమిస్తే అభివృద్ధికి ఆటంకమని, దోషులుగా నిలబెట్టాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ వారసత్వ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులా మారిన వారసత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో కాంగ్రెస్‌తో పాటు చాలా వరకు ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలే అయినా మోదీ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా కాంగ్రెస్‌ పార్టీని ఉద్దేశించేనని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు.. ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ రాజకీయ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కేంద్రంలోని నాయకులు మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, పటేల్‌, ఆజాద్‌లను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం చారిత్రక వాస్తవాలను వక్రీకరించొద్దని ప్రధాని మోదీకి సోనియాగాంధీ చురకలంటించారు.

ఇటు ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో రాజకీయాల ప్రస్తావన చేయడం సరికాదన్నారు. అయితే ఆపార్టీ నేత రాహుల్‌గాంధీ మాత్రం నో కామెంట్ అన్నారు. మరోవైపు ప్రధాని ప్రసంగంపై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. బీజేపీలోని అంతర్గత కలహాల వల్లే మోదీ వ్యాఖ్యలు చేసి ఉంటారని ఆపార్టీ నేత పవన్ ఖేరా ఎద్దేవా చేశారు. ఏదిఏమైనా గత కొన్నాళ్లుగా హస్తిన వేదికగా కేంద్రం, ఈడీ వర్సెస్‌గా సాగుతున్న పొలిటికల్ ఎపిసోడ్‌.. ఇపుడు వారసత్వ రాజకీయాలపై మోదీ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి.

Tags

Next Story