ప్రైవేట్ బస్ ప్రమాదం.. అమర్‌నాథ్ యాత్రకు వెళుతూ ఆరుగురు మృతి.. ఐదుగురి పరిస్థితి విషమం

మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా హైవే NH 6లో శనివారం ఉదయం రెండు లగ్జరీ ట్రావెల్ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా ఆరుగురు వ్యక్తులు మరణించారు. 25 మంది గాయపడ్డారు. జిల్లాలోని మల్కాపూర్ పట్టణంలోని ఫ్లై ఓవర్‌పై తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
అమర్‌నాథ్ యాత్రకు హింగోలికి వెళుతున్న ఒక బస్సు, నాసిక్ వైపు వెళ్తున్న మరో బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. నాసిక్ వైపు వెళ్తున్న బస్సు ట్రక్కును ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించి రెండో బస్సుకు ఎదురుగా రావడంతో ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దాంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఈ నెల ప్రారంభంలో ఇదే రాష్ట్రంలో చోటు చేసుకున్న ప్రమాదంలో సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సులో మంటలు చెలరేగడంతో కనీసం 26 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. ఇప్పుడు మరో ప్రమాదం చోటు చేసుకోవడం విచారకరం అని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.
ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com