Priyanka gandhi: వయనాడ్‌లో ప్రియాంక నామినేషన్‌

ప్రియాంకాగాంధీ ఆస్తులు ఎన్నంటే..!

కేరళలోని వయనాడ్‌ లోక్‌సభకు జరిగే ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్‌ వేశారు. తొలిసారిగా క్రియాశీల రాజకీయాల్లో నేరుగా పోటీ చేస్తున్న ఆమె నామినేషన్‌కు ముందు కాల్‌పెట్టా, తాంకెడ్‌లలో భారీ రోడ్‌ షో నిర్వహించారు. నామినేషన్‌ కార్యక్రమంలో ఆమె వెంట తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. కాగా, తనకు 12 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్‌లో ప్రియాంక తెలిపారు.

తాజాగా ప్రియాంక దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆమె ఆస్తుల వివరాలు వెల్లడించారు. ప్రియాంక గాంధీకి రూ. 12 కోట్ల ఆస్తులు, భర్త రూ. 65 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో అద్దె ఆదాయం, ఇతర పెట్టుబడులతో కలిపి మొత్తం రూ. 46.39 లక్షల ఆదాయాన్ని ప్రియాంక ప్రకటించింది. ఆస్తుల్లో రూ.4.25 కోట్ల చరాస్తులు ఉన్నాయి. వాటిలో మూడు బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్లు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు, పీపీఎఫ్, రాబర్డ్ వాద్రా గిఫ్ట్‌గా ఇచ్చిన హోండా సీఆర్‌వీ కారు, రూ.1.15 కోట్లు విలువచేసే 4400 గ్రాములకు పైగా బంగారం ఉన్నాయి.

స్థిరాస్తుల విలువ రూ.7.74 కోట్లు. వీటిలో ఢిల్లీలోని మెహ్రౌలి ఏరియాలో రెండు అగ్రికల్చరల్ ల్యాండ్స్ (ఇన్‌హెరిటెడ్ హాఫ్-షేర్స్), ఫామ్‌హౌస్‌లో హాఫ్-షేర్ వంటివి ఉన్నాయి. సొంతంగా హిమాచల్ ప్రదేశ్‌లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఉంది. దీని విలువ రూ.5.63 కోట్లు. రూ.15.75 కోట్ల మేరకు రుణాలు కూడా ఉన్నాయి. అదనంగా ఆమెపై రెండు ఎఫ్ఐఆర్‌లు, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన ఒక నోటీసు ఉన్నట్టు ఆ అఫిడవిట్‌లో ప్రియాంక తెలిపారు. ప్రియాంక భర్త, వ్యాపారవేత్త రాబర్డ్ వాద్రాకి రూ.37.9 కోట్లు విలువచేసే చరాస్తులు, రూ.27.64 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ప్రియాంక గాంధీ తన చదువు వివరాలను కూడా అఫిడవిట్‌లో ప్రకటించారు. యూకేలోని సుందర్‌లాండ్ యూనివర్శిటీ నుంచి దూరవిద్య ద్వారా బుద్దిస్ట్ స్టడీస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్రొమో చేశారు. ఢిల్లీ యూనివర్శిటీలో సైకాలజీలో బీఏ హానర్స్ డిగ్రీ ఉంది.

Tags

Next Story