Central Govt: బ్రిటన్ కు విచారణ సంస్థలు..

బ్యాంకుల నుంచి వేలకోట్ల రూపాయలు రుణాలు తీసుకుని ఎగ్గొట్టి..విదేశాలకు పరారైన ఆర్థిక నేరస్థులను భారత్ రప్పించేందుకుకేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నీరవ్ మోదీ, విజయమాల్యాలను భారత్ తీసుకొచ్చేందుకు CBI, ఈడీ, NIAల బృందం త్వరలో బ్రిటన్‌కు వెళ్లనుంది. యూకేలో వారు సంపాదించిన ఆస్తులపైనా..... ఈ బృందం వివరాలను సేకరించనుంది.
ఆర్థిక నేరస్థుల ఆటకట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సీబీఐ, ఈడీ, NIAలకు చెందిన ఉన్నత స్థాయి బృందం ఈ మేరకు యునైటెడ్ కింగడమ్- యూకేకు వెళ్లనుంది. ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారి, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటర్ విజయ మాల్యాలను భారత్‌కు తీసుకొచ్చే చర్యలను ఈ బృందం మరింత వేగవంతం చేయనుంది. భారత్-యూకే మధ్య ముచ్యువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రిటీ-MLAT ఉంది. ఈ ఒప్పందం ప్రకారం.. ఇరుదేశాలు ఆర్థిక నేరస్థులు, ఇతర నేరస్థులపై క్రిమినల్ విచారణ ఎంతవరకు వచ్చిందో సమాచారం పంచుకోవాల్సి ఉంది. మూడు దర్యాప్తు సంస్థల ఉన్నతస్థాయి బృందం యూకే అధికారులతో MLAT కింద సమాచారం పంచుకోనుంది.ఈ అంశం చాలాకాలంగా ఇరుదేశాల మధ్యపెండింగ్‌లో ఉంది. NIA బృందం ఖలిస్థాన్ వంటి తీవ్రవాద సంస్థల కేసులను ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది. MLAT వివరాలను భారత విదేశాంగ శాఖ ఒప్పందం ఉన్న దేశాలకు చురుగ్గా తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో 3 దర్యాప్తు సంస్థల ఉన్నతస్థాయి బృందంలో విదేశాంగ శాఖ సీనియర్ అధికారి కూడా ఉన్నట్లు సమాచారం. యూకే అధికారులతో సెషన్ల వారీగా సీబీఐ, ఈడీ, NIA బృందం సమావేశాలను.. లండన్‌లోని భారత హైకమిషన్ పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు.
నేరస్థుల అప్పగింత ఒప్పందం కింద నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, సంజయ్ భండారీలను అప్పగించాలని కోరడంతో పాటు యూకేలో వారు సంపాదించిన ఆస్తులు, బ్యాంకింగ్ లావాదేవీల వివరాలను భారత బృందం తెలుసుకోనుంది. యూకే సహా విదేశాల్లో నేరస్థుల ఆస్తులను కనుగొనే ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోందని వాటిని జప్తు చేసేందుకు ప్రయత్నిస్తామని అధికారవర్గాలు తెలిపాయి. భారత్‌కు పంపాలన్న కోర్టుల ఆదేశాలపై సంజయ్ భండారి, నీరవ్ మోదీ, విజయ్ మాల్యా ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీలు చేశారు. వాటి తీర్పుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈడీ ఇప్పటికే భారత్‌లోని వారి ఆస్తులను జప్తు చేసింది. మాల్యా, నీరవ్ మోదీల ఆస్తులను అమ్మడం ద్వారా పెద్ద మొత్తం నగదును వసూలు చేసింది. తర్వాత వాటిని బ్యాంకులకు అప్పగించింది. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు సన్నిహితుడిగా పేరున్న సంజయ్ భండారీ 2016లో పరారయ్యాడు. యూపీఏ హయాంలో వేర్వేరు రక్షణ ఒప్పందాలపై ఆదాయ పన్ను విభాగం, ఈడీ దర్యాప్తు చేపట్టిన తర్వాత... భండారీ పరారయ్యాడు. ఈడీ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం..లండన్, దుబాయ్‌లో ఆస్తులను సంపాదించిన భండారీ..తర్వాత వాటిని రాబర్ట్ వాద్రా అనుచరుడైన సీసీ థంపీకి చెందిన షెల్ కంపెనీలకు మళ్లించాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి 6 వేల500 కోట్లు రుణాలు తీసుకుని,వాటిని దారిమళ్లించిన కేసులో మోసం కేసును... నీరవ్ మోదీ ఎదుర్కొంటున్నాడు. బ్యాంకులను 5 వేల కోట్లకు మోసం చేసిన కేసులో 5 వేల కోట్ల రూపాయల మాల్యా ఆస్తులను జప్తు చేశారు. భారత్‌లో సంజయ్ భండారీకి చెందిన 26 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మాల్యా, నీరవ్ మోదీల మాదిరిగానే భండారీని కూడా ప్రత్యేక కోర్టు పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com