Jharkhand: మంత్రి పర్సనల్ సెక్రటరీ ఇంట్లో నోట్ల కట్టలు కాదు గుట్టలు

సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో.. ఝార్ఖండ్‌లోని ఓ ఇంట్లో నోట్ల గుట్టలు బయటపడ్డాయి. ఓ మనీలాండరింగ్ కేసులో తనిఖీల కోసం వెళ్లిన ED అధికారులకు సినిమాల్లో చూసినట్టుగా బ్యాగులు, సంచుల్లో కరెన్సీ కట్టలు దర్శనమిచ్చాయి. వాటిని ఓ చోట కుమ్మరించిన అధికారులు.... ఆ డబ్బు 20 నుంచి 30 కోట్ల మధ్య ఉంటుందని తెలిపారు.
మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఝార్ఖండ్ రాజధాని నగరం రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరెక్టరేట్-ED సోదాలు నిర్వహించింది. ఆ కేసులో ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసిన మాజీ చీఫ్ ఇంజినీర్ వీరేంద్ర రామ్ 2023లో అరెస్టయ్యారు. దర్యాప్తులో భాగంగా ఆయనకు చెందిన 10కి పైగా ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ఈ క్రమంలోనే గడిఖానా చౌక్‌లో...గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంఘీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ పనిమనిషికి చెందినదిగా భావిస్తోన్న ఇంట్లో నోట్ల గుట్టలు దర్శనమిచ్చాయి. బ్యాగులు, సంచుల్లో ఉన్న కరెన్సీ కట్టలను ఈడీ అధికారులు ఓ చోట కుమ్మరించారు. డబ్బు కట్టలున్నఆ దృశ్యాలు సినిమాను తలపించాయి.
ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న డబ్బులో చాలా వరకు 500 రూపాయల నోట్లు ఉన్నాయి. కొంత మేర ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంఘీర్ ఆలంను డబ్బు వ్యవహారంపై ప్రశ్నించగా ఆయన వాటితో తనకు సంబంధం లేదని తెలిపారు. తన వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్‌ను ప్రభుత్వమే ఏర్పాటు చేసిందనీ డబ్బును అధికారులు స్వాధీనం చేసుకున్నారన్న విషయం తాను కూడా టీవీలో చూసినట్టు తెలిపారు. గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసిన మాజీ చీఫ్ ఇంజినీర్ వీరేంద్ర రామ్ 2023లో అరెస్టు కావడానికి కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకోవడమే కారణమని ఈడీ అంతకుముందు పేర్కొంది. టెండర్లు దక్కెందుకు కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు తీసుకున్నారనీ...దర్యాప్తు తర్వాత ఆయనకు చెందిన 39 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేసినట్టు తెలిపింది. నోట్ల కట్టల వ్యవహారంపై భాజపా నేతలు స్పందించారు. ఝార్ఖండ్‌లో అవినీతి ముగిసిపోలేదనీ.... ప్రస్తుతం జరుగుతోన్న ఎన్నికల్లో భాగంగా కొందరు వ్యక్తులు వీటిని ఉపయోగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు . దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com