Parliament: పార్లమెంట్‌లో తగ్గని మణిపూర్‌ మంటలు

Parliament: పార్లమెంట్‌లో తగ్గని మణిపూర్‌ మంటలు
పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ కొనసాగుతున్న వాయిదాల పర్వం... నల్ల చొక్కాలు ధరించి విపక్ష ఎంపీల హాజరు.. అధికార, ప్రతిపక్ష నినాదాలతో దద్దరిల్లిన సభ...

పార్లమెంట్‌(Parliament) వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. మణిపుర్ అంశం(Manipur)పై ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. ప్రధాని సమక్షంలోనే మణిపుర్‌ అంశంపై చర్చ జరగాలని విపక్షాలు(Opposition) పట్టుపట్టడంతోపార్లమెంటులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇవాళ కూడా ఆరంభంలోనే ఉభయసభలు వాయిదాపడ్డాయి.


ఉదయం 11 గంటలకు లోక్ సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓంబిర్లా ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. అయితే విపక్షసభ్యులు తమ స్థానాల్లోంచి లేచి వెల్ లోకి దూసుకెళ్లారు. ఇండియా ఫర్ మణిపుర్ అనే ప్లకార్డులను ప్రదర్శించారు. అన్ని అంశాలను పక్కనపెట్టి తక్షణం మణిపుర్ ఘటనలపై చర్చ చేపట్టాలని నినాదాలు చేశారు. స్పీకర్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా ప్రతిపక్ష సభ్యులు శాంతించలేదు. విపక్ష సభ్యుల నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ ఓంబిర్లా మధ్యాహ్నం 2గంటల వరకు లోక్ సభను వాయిదావేశారు.


మణిపుర్‌ అంశంపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా విపక్ష సభ్యులు నల్ల దుస్తులు ధరించి సభకు హాజరయ్యారు. మణిపుర్‌లో చోటుచేసుకుంటున్న అకృత్యాలను నిరసించేందుకు, ఈ క్లిష్ట పరిస్థితుల్లో వారికి అండగా ఉన్నామని తెలిపేందుకే నల్ల దుస్తులు ధరించామని ఆప్‌ ఎంపీ రాఘవ్ చద్దా వెల్లడించారు. అలాగే మణిపుర్‌ ముఖ్యమంత్రిని తొలగించాలని డిమాండ్ చేశారు.

రాజ్యసభలోనే ఇదే పరిస్థితి కొనసాగింది. సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు మణిపుర్ అంశంపై చర్చకు పట్టుపట్టారు. అయితే రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ అనుమతితో విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశాంగ విధానంపై ఓ ప్రకటన చేశారు. విపక్షాల నినాదాల మధ్యే ఆయన ఈ ప్రకటన చేశారు. ఆ తర్వాత కూడా విపక్షాలు ఆందోళన విరమించకపోవటంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మళ్లీ సమావేశమైనా పరిస్థితిలో మార్పు లేకపోవటంతో మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ వాయిదాపడింది.


విపక్ష ఎంపీలు నల్లదుస్తులు ధరించిరావడాన్ని భాజపా నేత పీయూష్ గోయల్ విమర్శించారు. తీవ్రమైన విషయాలపై కూడా రాజకీయాలు చేయడం దురదృష్టకరమని గోయల్‌ అన్నారు. అంతర్జాతీయంగా భారత్‌కు పెరుగుతోన్న ప్రతిష్ఠను ఈ నల్లదుస్తులు ధరించిన వ్యక్తులు అర్థం చేసుకోలేకపోతున్నారని విమర్శించారు. వారి గతం, వర్తమానం, భవిష్యత్తు అంధకారంలో ఉందని, కానీ, మేం వారి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆశిస్తున్నామని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

Tags

Read MoreRead Less
Next Story