Protest Skm: 21న బీజేపీ ఎంపీలకు నల్లజెండాలతో నిరసన

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమ విరమణ సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆందోళనకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ నెల 21న బీజేపీతో సహా అధికార ఎన్డీయే పక్ష ఎంపీలకు వ్యతిరేకంగా నల్లజెండాలతో నిరసనలు తెలుపాలని రైతులకు సూచించింది. మరోవైపు పంజాబ్‌లో బీజేపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షుల ఇండ్ల ముందు ఈనెల 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు 24 గంటల ఆందోళన కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఎస్కేఎం ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. కార్మిక, ప్రజా సంఘాలు సంఘీభావం తెలపాలని కోరింది. ఇదిలా ఉండగా, రైతు నేతలతో కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, గోయల్, నిత్యానంద రాయ్ జరిపిన 4వ విడత చర్చలు కూడా అసంపూర్తిగా ముగిశాయి. మరోవైపు పంజాబ్-హరియాణా సరిహద్దుల్లో శంభూ, ఖనౌరీ పాయింట్ల వద్ద వేలాది మంది రైతుల నిరసన కొనసాగుతోంది.
పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తామని బీజేపీ 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని, అయితే మోదీ సర్కార్ మోసం చేస్తున్నదని విమర్శించింది. ఈనెల 21న ఉత్తరప్రదేశ్‌లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాక్టర్ల మార్చ్ నిర్వహించనున్నట్టు బీకేయూ ప్రకటించింది. రైతుల ఆందోళనకు మద్దతుగా 26, 27 తేదీల్లో రైతులు తమ ట్రాక్టర్లను ఢిల్లీకి వెళ్లే హైవేలపై పార్క్ చేస్తారని తెలిపింది. ట్రాక్టర్ల ర్యాలీలో భారీయెత్తున రైతులు పాలుపంచుకోవాలని రైతు నేత రాకేశ్ టికాయిత్ పిలుపునిచ్చారు. మరోవైపు, రైతుల చలో ఢిల్లీ మార్చ్ ఆదివారం ఆరో రోజుకు చేరుకున్నది. పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో వందల మంది రైతులు నిరసన కొనసాగిస్తున్నారు.
మరోవైపు రైతుల ఆందోళన నేపథ్యంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. హర్యానాలోని ఏడు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని ఈనెల 19 వరకు పొడిగించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు పంజాబ్‌లో పటియాలా, సంగ్రూర్, ఫతేగఢ్ సాహిబ్ తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సేవల రద్దును 24 వరకు పొడిగించారు. కేంద్ర ప్రభుత్వం కాలయాపన విధానాలు మానుకొని, లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే కంటే ముందే ఎంఎస్పీకి చట్టబద్ధతతో సహా రైతుల ఇతర డిమాండ్లను పరిష్కరించాలని రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com