కార్పొరేట్ ఉద్యోగాలు వదిలి.. ఆర్గానిక్ ఫామ్‌లను ప్రారంభించి.. ఏటా రూ.3 కోట్ల టర్నోవర్

కార్పొరేట్ ఉద్యోగాలు వదిలి.. ఆర్గానిక్ ఫామ్‌లను ప్రారంభించి.. ఏటా రూ.3 కోట్ల టర్నోవర్
X
ఆరంకెల జీతం.. అయినా ఎందుకో నిరాసక్తత.. ఆత్మసంతృప్తి లేదు.. చేస్తున్న పని రొటీన్ గా అనిపించింది..

ఆరంకెల జీతం.. అయినా ఎందుకో నిరాసక్తత.. ఆత్మసంతృప్తి లేదు.. చేస్తున్న పని రొటీన్ గా అనిపించింది.. ఏసీ రూములు, జంక్ ఫుడ్ లు ఇది కాదు జీవితం.. ఏదో చేయాలన్న తపన... అడుగులు పొలం గట్లవైపు పడ్డాయి. వ్యవసాయం చేయాలనుకున్నారు. సేంద్రియ పద్దతిలో వ్యవసాయం చేసి ఆర్గానిక్ ఉత్పత్తులను అందరికీ అందిస్తున్నారు ఈ అన్నదమ్ములు. పూణే సోదరులు అజింక్యా, సత్యజిత్ ఆర్గానిక్ ఫారమ్‌ను ప్రారంభించి కోట్లు సంపాదిస్తున్నారు.

పూణే యూనివర్శిటీ నుండి MBA పూర్తి చేసిన తర్వాత, సత్యజిత్, అజింక్యా దాదాపు ఒక దశాబ్దం పాటు అగ్రశ్రేణి MNC కంపెనీలలో పని చేశారు. కానీ ఎప్పుడూ ఏదో చిరాకు. ఉద్యోగం చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మరి మానేస్తే ఏం చేయాలి అన్న ఆలోచన.. ఆర్గానిక్ ఉత్పత్తుల వైపు వారి దృష్టిని సారించారు.

ఇందాపూర్ తాలూకాలోని భోదాని గ్రామంలో ఉన్నప్పుడే తాము నిజంగా సంతృప్తి చెందుతామని వారు గ్రహించారు. తమ కార్పొరేట్ ఉద్యోగాలతో విసిగి వేసారిన వారు సేంద్రీయ వ్యవసాయదారులుగా మారాలని నిర్ణయించుకుని టూ బ్రదర్స్ ఆర్గానిక్ ఫామ్‌లను ప్రారంభించారు.

వారి నిర్ణయంతో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు ఎవ్వరూ ఏకీభవించలేదు. మీకేమైనా పిచ్చిపట్టింది. హాయిగా ఉద్యోగాలు చేసుకోక.. వ్యవసాయం అంత ఈజీ కాదు. లాభదాయకమైన ఎంపిక అంతకంట కాదు. సిటీలో చదువుకుని పొలంలో కష్టపడి పని చేస్తారా.. అని అందరూ వారి నిర్ణయాన్ని తిప్పి కొట్టిన వాళ్లే.. కానీ వారు తమ మీద తమకు నమ్మకం ఉంచుకున్నారు. ఎవరి సలహాలు, సూచనలు పాటించదలుచుకోలేదు. కష్టమో, సుఖమో తామే పడాలనుకున్నారు.

తమకు ఉన్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం ప్రారంభించారు హంగే సోదరులు. నేడు 20 ఎకరాల పొలంలో సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఏటా రూ.3 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నారు. వారు వ్యవసాయంలో సాంప్రదాయ పద్ధతులను అవలంబిస్తారు. ఆవు పేడను ఎరువుగా ఉపయోగిస్తారు.

బియ్యం, నెయ్యి, పప్పు, చ్యవాన్‌ప్రాష్ తో సహా అనేక రకాల సేంద్రీయ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 14 దేశాలకు చెందిన నిపుణులు వారి సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను తెలుసుకోవడానికి వారి పొలాలను సందర్శించారు . వీరిలో USA, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా నుండి ప్రయాణికులు, రైతులు, మీడియా నిపుణులు, బ్యాంకర్లు కూడా ఉన్నారు.

Tags

Next Story