Pune Porsche accident: నిందితుడి బ్లడ్‌ టెస్ట్‌ రిపోర్ట్‌ మార్చేసిన వైద్యులు

Pune Porsche accident:  నిందితుడి బ్లడ్‌ టెస్ట్‌ రిపోర్ట్‌ మార్చేసిన  వైద్యులు
X
అరెస్ట్ అయిన వారిలో ఒకరు ఫోరెన్సిక్ విభాగం హెడ్.. మరొకరు ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్

దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన పూణె టీనేజర్ డ్రంకెన్ డ్రైవ్ కేసు మరో మలుపు తిరిగింది. డబ్బు ఎలాంటి పనిని అయినా చేయిస్తుంది అన్న నమ్మకంతో బాలుడి కుటుంబం చేసిన మరో చెత్తపని బయట పడింది. కేసును విచారిస్తున్న పోలీసులు నగరంలోని సాసూన్ జనరల్ ఆసుపత్రికి చెందిన ఇద్దరు వైద్యులను అరెస్ట్ చేశారు. యాక్సిడెంట్ తర్వాత బాలుడి రక్త నమూనాలను మార్చినట్టు అభియోగాలు వారిపై నమోదయ్యాయి. అరెస్ట్ అయిన ఇద్దరు వైద్యుల్లో ఒకరు ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ అజయ్ టవేరే కాగా, మరొకరు ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ శ్రీహరి హర్నోర్. ప్రమాద సమయంలో బాలుడు మద్యం సేవించలేదని చెప్పేందుకు వీరిద్దరూ కలిసి బాలుడి రక్తనమూనాలను తారుమారు చేసినట్టు పోలీసులు తెలిపారు.

ఇప్పటికే ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పుణే పోలీసులు కూడా తీవ్రంగా పరిగణించారు. దర్యాప్తు సమయంలో నగర కమిషనర్‌ అమితేష్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘‘ఇదేదో మద్యం మత్తులో చేసిన యాక్సిడెంట్‌ కేసు కాదు. నిందితుడైన మైనర్‌కు తాను పార్టీ చేసుకొంటూ ఆల్కహాల్‌ తాగిన విషయం స్పష్టంగా తెలుసు. అలాంటి పరిస్థితుల్లో కారు నడిపితే రోడ్డుపై వారి ప్రాణాలకు ప్రమాదమన్న విషయంపై అతడికి పూర్తి అవగాహన కూడా ఉంది’’ అని పేర్కొన్నారు.

ఈ కేసును క్రైంబ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 19న బార్‌లో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్న బాలుడు తన ఖరీదైన పోర్షే కారులో తెల్లవారుజామున ఇంటికి వస్తూ బైక్‌పై వెళ్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను ఢీకొట్టాడు. ఈ ఘటనలో వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ప్రమాదం జరిగిన 14 గంటల్లోనే నిందితుడైన బాలుడికి బెయిలు మంజూరు చేసిన జువైనల్ కోర్టు.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన విమర్శలతో ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుని జూన్ 5 వరకు అబ్జర్వేషన్‌కు పంపింది. ఈ కేసులో ఇప్పటికే టీనేజర్ తండ్రి, తాతను పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుడి తండ్రి నగరంలో బడా రియల్టర్‌. ఈ కేసును తప్పుదోవ పట్టించి మైనర్‌ను రక్షించేందుకు మైనర్‌ కుటుంబీకులు తీవ్ర యత్నాలు చేశారు. వారి డ్రైవర్‌ను ఈ కేసులో ఇరికించేందుకు నిందితుడి తండ్రి, తాత తీవ్ర స్థాయిలో యత్నించినట్లు గుర్తించారు. అంతేకాదు.. కొందరు పోలీసులను ప్రభావితం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇద్దరు అధికారులపై వేటువేశారు. ఇప్పుడు తాజాగా ఫోరెన్సిక్‌ పరీక్షలు చేసే వైద్యులు కూడా రక్తనమూనాలను తారుమారు చేయడానికి యత్నించినట్లు తేలడం ఆందోళనకరంగా మారింది.

Tags

Next Story