Pune Car Accident: మద్యం తాగి డ్రైవింగ్ చేశానని అంగీకరించిన బాలుడు ?

పుణెలో విచక్షణారహితంగా పోర్షే కారును నడిపి, ఇద్దరి మృతికి కారకుడైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలుడు నేరాన్ని అంగీకరించాడని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తాను డ్రైవింగ్ చేస్తున్న సమయంలో పూటుగా మద్యం సేవించినట్లు అతడు తెలిపాడు. జరిగిన సంఘటనలు తనకు పూర్తిగా గుర్తు లేవని వెల్లడించాడు. మరోవైపు బాలుడి తల్లిదండ్రులకు ఈ నెల 5 వరకు పోలీసు కస్టడీకి పుణే కోర్టు ఆదేశించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన మూడు కేసుల దర్యాప్తుకు 100 మంది పోలీసులను నియమించారు.
నిందితుడి తల్లిదండ్రులను పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ జూన్ 5 వరకు కోర్టు రిమాండు విధించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ససూన్ జనరల్ ఆసుపత్రికి వీరిద్దరూ స్వయంగా వెళ్లి కుట్రపూరితంగా రక్త నమూనాల మార్పిడికి పాల్పడినట్లు పోలీసులు ఆదివారం హాలిడే కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. మే 19న జరిగిన ఈ రోడ్డుప్రమాదం ఆధారాల చెరిపివేతకు ప్రయత్నించిన దంపతుల విచారణ నిమిత్తం కస్టడీని పోలీసులు కోరగా, కోర్టు అనుమతించింది. కేసు విచారణను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించిన బాలుడి తాత సురేంద్ర అగర్వాల్‌ను, రియల్టర్ అయిన తండ్రి విశాల్ అగర్వాల్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
కుమారుడి రక్త నమూనాల స్థానంలో తన రక్త నమూనాలు పెట్టేందుకు సహకరించిన తల్లి శివానీ అగర్వాల్‌ను సైతం జూన్ 1న అదుపులోకి తీసుకున్నారు. రక్త నమూనాల మార్పిడికి సహకరించిన ఇద్దరు వైద్యులు, ఓ ఉద్యోగి కూడా కటకటాలపాలయ్యారు. ఈ వ్యవహారంలో పోలీసులు మొత్తం మూడు కేసులను నమోదు చేశారు. ఒకటి రోడ్డుప్రమాదంపై కాగా, మైనర్ అయిన బాలుడికి మద్యం సరఫరా చేసిన బార్ యజమానిపై మరొక కేసు నమోదయింది. లైసెన్సు లేని బాలుడిని కారు నడిపేందుకు అనుమతించిన తండ్రిపై మూడో కేసు పెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com