INDIA-US DEAL: డ్రోన్ల కొనుగోలు ధరపై రక్షణశాఖ క్లారిటీ
భారత ప్రధాని మోడీ...అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య జరిగిన కీలక భేటీలో రక్షణ రంగానికి సంబంధించిన కీలక ఒప్పందాలు కుదిరాయి. అందులో నింగి, నేల, నీరు ఎక్కడైనా ఏ పనైనా చేయగల ఎంక్యూ 9 రీపర్ డ్రోన్ల కొనుగోలు ఒప్పందం అందరి దృష్టిని ఆకర్షించింది. అమెరికాలో తయారైన ఈ అత్యాధునిక డ్రోన్లను భారత్‌కు సరఫరా చేసేలా మోడీ-బైడెన్ ఒప్పందం చేసుకున్నారు. అమెరికా నుంచి అప్‌గ్రేడెడ్ MQ-9B డ్రోన్‌లను కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది. సుమారు 3 బిలియన్ డాలర్ల విలువైన ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను కేంద్ర రక్షణ శాఖ కొట్టిపారేసింది. ఈ వార్తలు కేవలం పుకార్లేనని స్పష్టం చేసింది. MQ-9B సిరీస్ డ్రోన్ల కొనుగోలు ధర ఇంకా నిర్ణయించలేదని వివరించింది. అమెరికా నుంచి కొనుగోలు చేయనున్న 31.. MQ-9B డ్రోన్‌ల ధర ఇంకా ఖరారు కాలేదని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇతర దేశాలతో పోల్చి చూసిన తర్వాత మాత్రమే ధరను నిర్ణయిస్తామని తేల్చి చెప్పింది. MQ-9B డ్రోన్ల ధర, ఇతర కొనుగోలు నిబంధనలు ఇవేనంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను రక్షణ శాఖ తీవ్రంగా ఖండించింది. సోషల్ మీడియా వార్తలు నిజం కాదని... ఇంకా ధర, నిబంధనలు నిర్ణయించలేదని వివరించింది. సాయుధ బలగాల నైతికతపై తీవ్ర ప్రభావం చూపే ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని రక్షణ శాఖ అభ్యర్థించింది. ఈ డ్రోన్ల వ్యయం 3,072 మిలియన్ డాలర్లని అమెరికా ప్రతిపాదించిందని దీనిపై చర్చలు జరుపుతామని పేర్కొంది. 31 MQ-9B హై-ఆల్టిట్యూడ్ డ్రోన్‌లు సముద్ర, ఆకాశ మార్గాల్లో నిఘా అస్త్రాలుగా భారత్‌కు సేవలందిస్తాయి. ఇవి పేలోడ్స్ క్యారీ చేయగలవు, అవసరమైతే దాడులకు సైతం ఉపయోగించుకోవచ్చు. ఈ డ్రోన్లలో సగం ఇండియన్ నేవీకి అందజేసే అవకాశం ఉందని, మిగిలిన వాటిని భారత సైన్యం, వైమానిక దళం నిఘా కోసం ఉపయోగిస్తాయని అధికారులు తెలిపారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ సున్నితమైన ప్రాంతాల్లో డ్రాగన్ పైచేయి సాధించాలని భారత్ చూస్తోంది. ఈ నేపథ్యంలో సుదూర ప్రాంతాలో డ్రోన్‌లతో నిఘా పెట్టాలని నిర్ణయించింది. ఈ డ్రోన్లతో సరిహద్దుల్లో చైనా ఆర్మీపై నిఘా పెట్టవచ్చని ఇండియన్ ఆర్మీ భావిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com