Puri Rath Yatra: శోభాయమానంగా జగన్నాథుడి రథయాత్ర
జై జగన్నాథ్ నామస్మరణ, జయజయద్వానాల మధ్య ఒడిశాలోని పూరీలో విశ్వప్రసిద్ధ జగన్నాథుని రథయాత్ర ఆదివారం వైభవోపేతంగా సాగింది. శ్రీక్షేత్రంలో 53 ఏళ్ల తర్వాత ఒకేరోజున పురుషోత్తముని నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్రలు ఏర్పాటయ్యాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచే సేవలు ప్రారంభం కాగా, నిర్ణీత వ్యవధి కంటే 2 గంటల ముందుగా 11.30 గంటలకు జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల పొహండి చేపట్టారు. ఈ వేడుక 2 గంటలపాటు సాగింది.
రథారూఢులైన చతుర్థ మూర్తులకు పూరీ శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి హారతిచ్చారు. పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్ రథాలపై ఆనవాయితీ ప్రకారం చెరాపహరా (బంగారు చీపురుతో ఊడ్చి) చేసి, రథాలకు సారథులు, ఆశ్వాలు అమర్చి తాళ్లు కట్టారు. సాయంత్రం 5 గంటలకు బలభద్రుని తాళధ్వజ రథం గుండిచా దేవీ ఆలయానికి బయలు దేరింది. భక్తులు ఉత్సాహంగా రథం లాగారు. తర్వాత సుభద్రదేవి దర్పదళన్ రథం బయలుదేరింది. జగన్నాథుని నందిఘోష్ రథాన్ని 5 అడుగుల దూరం లాగి ఉంచేశారు. నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర ఉత్సవాలు ఒకేరోజు కావడంతో రాత్రయ్యేలోపు రథాలు గుండిచాదేవి సన్నిధికి చేరుకోలేదు. సూర్యాస్తమయం తర్వాత యాత్ర కొనసాగించొద్దనే నిబంధన ఉండటంతో బొడొదండొలో మార్గమధ్యంలో నిలిపేశారు. దీంతో సోమవారం కూడా రథయాత్ర కొనసాగించి రథాలను గుండిచా మందిరం వద్దకు చేర్చనున్నారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఒడిశా గవర్నరు రఘుబర్‌దాస్, ఒడిశా సీఎం మోహన్‌చరణ్ మాఝి, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో కలిసి రథయాత్రను తిలకించారు. ఆమె గవర్నర్ రఘుబర్‌దాస్, ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝితో కలిసి సుభద్ర రథం దర్పదళన్‌ను లాగారు. ఈ యాత్రను చూసేందుకు 10 లక్షలకుపైగా భక్తులు వచ్చారు.
తాళధ్వజ రథాన్ని లాగుతున్న సమయంలో ఓ భక్తుడు స్పృహతప్పి పడిపోయాడు. ఆయనను వెనక ఉన్నవారు తొక్కేశారు. పోలీసులు ఆసుపత్రికి తరలించినా భక్తుడు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భక్తుల రద్దీ తీవ్రంగా ఉండడంతో ఉక్కపోత వల్ల 300 మంది స్పృహతప్పారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం వారంతా కోలుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com