Ratna Bhandar: నేడు మళ్లీ తెరుచుకున్న రత్నభాండాగారం
భువనేశ్వర్: ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారాన్ని ఈరోజు మరోసారి తెరిచారు. రహస్య గదిలోని విలువైన వస్తువుల్ని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించనున్నారు. ఆ గదిని తెరుస్తున్న కారణంగా భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. 46 ఏళ్ల తర్వాత ఆభరణాల లెక్కింపునకు శ్రీకారం చుట్టడంతో గత ఆదివారం తర్వాత నేడు మరోసారి రత్న భాండాగారం తెరుచుకుంది.
ఈ విషయంపై గత సాయంత్రం జస్టిస్ రథ్, ఆలయ కార్యనిర్వహణాధికారి అరవింద పాధి విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఈ నెల 14న ఖజానాలోని మొదటి రెండు గదుల్లోని పురుషోత్తముడి సంపదను తీసి తాత్కాలిక స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించాం. ఇదంతా వీడియో తీశారు. ఈ నెల 18న సీక్రెట్ రూమ్‌ను తెరిచి మరో తాత్కాలిక స్ట్రాంగ్‌రూమ్‌లో నిధులు భద్రపరుస్తాం. తర్వాత ఈ గోదామును మరమ్మతుల కోసం పురావస్తు శాఖకు అప్పగిస్తాం. పని పూర్తయిన తర్వాత, సంపద మొత్తాన్ని తిరిగి రహస్య గదికి తీసుకువచ్చి నగలు లెక్కించబడతాయి. గురువారం ఉదయం నుంచి రహస్య గది తెరవడంతో భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్లు ఆలయ పాలకమండలి ప్రకటించింది.
46 ఏళ్ల తర్వాత ఆదివారం రహస్య గదిని తెరిచిన అధికారులు సమయాభావం వల్ల సంపదను లెక్కకట్ట కుండానే తిరిగి గదికి సీజ్ చేశారు. ఇన్నర్, ఔటర్ గదులలోని సంపదను ఆదివారం తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలించి అధికారులు భద్రపరిచారు. నిన్న ఘనంగా స్వామివారి సున్నా భేషో వేడుక నిర్వహించారు. ప్రధాన ఆలయం బయట రథాలపై కొలువుతీరిన జగన్నాథ స్వామి, బలభద్ర, శుభద్రలకు సున్నాభేషో వేడుకలో భాగంగా అభరణాలు అలంకరించారు. ఇన్నర్, ఔటర్ గదుల నుంచి ఆదివారం తరలించిన అభరణాలను అర్చకస్వాములు అలంకరించారు. నేడు రహస్య గదిని తెరిచి అందులోని సంపదను అధికారులు తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కి తరలించనున్నారు. అనంతరం రహస్యగదికి మరమ్మత్తులు చేపట్టనున్న పురావస్తు శాఖ, రహస్య గది భద్రతను అధికారులు పరిశీలించనున్నారు. మరమ్మత్తులు పూర్తయ్యాక తిరిగి రహస్యగదికి తరలించి సంపదను లెక్కకట్టనున్నారు. రహస్య గది లెక్కింపుకు 30 నుంచి 40 రోజుల సమయం పట్టవచ్చని ఒరిస్సా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com