విదేశీ గడ్డపై ప్రధానీ మోదీని విమర్శించిన రాహుల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విదేశీ గడ్డపై ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. దేవుడి కంటే తమకే ఎక్కువ తెలుసని మోదీ అనుకుంటారని ఆయన ఓ ప్రత్యేక మనిషిగా నిలుస్తారని ఎద్దేవా చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా కాలిఫోర్నియాలోని శాంతాక్లారాలో ‘ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూఎస్‌ఏ’ నిర్వహించిన ‘మొహబ్బత్ కీ దుకాణ్’ కార్యక్రమంలో రాహుల్ ప్రసంగించారు. మోదీని విమర్శించిన రాహుల్ చరిత్రకారులకే వారు చరిత్ర చెప్పగలరన్నారు. శాస్త్రవేత్తలకు సైన్స్ నేర్పగలరు! యుద్ధం ఎలా చేయాలో సైన్యానికి బోధించగలరన్నారు. ఎంతో విశాలమైన ప్రపంచంలో అన్నీ తెలుసుకోవడం ఏ వ్యక్తికైనా కష్టమని.. కానీ భారత్‌లో మాత్రం కొందరు దీనికి అతీతలంటూ పరోక్షంగా మోదీపై విమర్శలు చేశారు. ఈ విశ్వం ఎలా పనిచేస్తుందని దేవుడికే మోదీ చెప్పగలరంటూ ఎద్దేవా చేశారు.
నిరుద్యోగం, అధిక ధరలు వంటి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేక కొత్త పార్లమెంటు భవనం పేరుతో హడావుడి చేస్తోందని విమర్శించారు రాహుల్. పార్లమెంటులో సెంగోల్‌కు ప్రధాని సాష్టాంగ నమస్కారం చేయడాన్ని ప్రస్తావిస్తూ తాను అలా సాగిలపడనందుకు మీరంతా ఆనందంగా లేరా అని సభికులను ప్రశ్నించారు.
సభకు అంతరాయం కలిగించేందుకు ఖలిస్థాన్ మద్దతుదారులు కొంతమంది ప్రయత్నించినా, భద్రత సిబ్బంది దానిని వమ్ము చేశారు. నినాదాలతో కొద్దిసేపు రాహుల్ తన ప్రసంగం నిలిపేయాల్సి వచ్చింది. ఎవరు ఏం చెప్పాలనుకున్నా ఆగ్రహించకుండా వినడం కాంగ్రెస్ ప్రత్యేకత అని, ఆందోళనకారులనూ తాను ఆహ్వానిస్తున్నానని ఆయనన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com