Rahul Gandhi : పవర్‌లోకి రాగానే వారిపై చర్యలుం

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయని అన్నారు. ఈ మేరకు అధికార బీజేపీని, ఆ పార్టీ చెప్పినట్లుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ సంస్థలను పరోక్షంగా ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి రూ.1800 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు అందడంపై రాహుల్ గాంధీ స్పందించారు. ‘ప్రభుత్వం మారినప్పుడు, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మళ్లీ ఇలాంటివి చేసే ధైర్యం ఎవరూ చేయని విధంగా చర్యలుంటాయి. ఇది నా హామీ’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఐటీ విభాగం శుక్రవారం మరోసారి నోటీసులు జారీ చేసింది. రూ.1,823 కోట్లు చెల్లించాలని కాంగ్రెస్‌కు ఐటీ నోటీసు రావడంపై పార్టీ మండిపడింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు బీజేపీ ఇలాంటి కుట్రలు పన్నుతోందని మండిపడింది. 2017-18, 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు ఐటీ రూ.1,823 కోట్ల డిమాండ్ నోటీసులు ఇచ్చినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. తమపై ఐటీ విభాగం ప్రక్రియను నిలిపివేయాలని పార్టీ వేసిన పిటిషన్‌ను గురువారం హైకోర్టు కొట్టేసిన వెంటనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఐటీ నోటీసలుపై సుదీర్ఘ న్యాయపోరాటానికి కాంగ్రెస్ సిద్ధమవుతోందని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా బీజేపీ వేలాది మంది నుంచి విరాళాలు పొందిందని, వారి ఆదాయపు పన్నును కూడా లెక్కించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఐటీ నోటీసులపై శనివారం దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలకు అధిష్టానం పిలుపునిచ్చింది. పీసీసీ కార్యాలయాల దగ్గర.. జిల్లా కార్యాలయాల దగ్గర ఆందోళనలు చేపట్టాలని కేసీ. వేణుగోపాల్ కోరారు.
కాగా, ఆదాయపు పన్ను వంటి కేంద్ర శాఖలు బీజేపీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. తమకు జారీ చేసిన పన్ను డిమాండ్ల రద్దు కోసం సుదీర్ఘ న్యాయపోరాటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నదని తెలిపారు. ఐటీ నోటీస్‌ను ‘ఉగ్ర పన్ను’గా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com