Rahul Gandhi: SIR ఎక్కడ ఉంటే అక్కడ ఓట్ల చోరీ :

కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై ఆరోపణలు చేశారు. ఎన్నికల కమిషన్ ఓట్లను దొంగిలించడానికి ప్రణాళికాబద్ధమైన కుట్రలో కీలక భాగస్వామిగా మారిందని ఆరోపించారు. ఓటర్లను ఎంపిక చేసి, ఓటు హక్కును తొలగించడానికి ఎన్నికల జాబితాను ఎస్ఐఆర్ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.
గుజరాత్‌లో ఎస్ఐఆర్ పేరుతో జరుగుతున్నది పరిపాలనాపరమైన కసరత్తు కాదని, ఒక వ్యక్తి-ఒక ఓటు అనే రాజ్యాంగ సూత్రాన్ని దెబ్బతీసి, ప్రజల బదులుగా బీజేపీనే అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఈ చర్యలకు పాల్పడుతోందని, SIR ఉన్న చోటల్లా ఓటు దొంగతనం జరుగుతోందని, గుజరాత్‌లో కూడా ఇదే విధంగా ప్రణాళికాబద్ధమైన కుట్ర జరుగుతోందని రాహుల్ గాంధీ ఎక్స్‌లో ఆరోపించారు. కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్యచే నిర్దిష్ట వర్గాలు, కులాలు, పోలింగ్ బూత్‌ల నుంచి ఓట్లను తొలగించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒకే పేరుతో వేల సంఖ్యలో అభ్యంతరాలు దాఖలయ్యాయని, బీజేపీకి ఓటమి భయం ఉన్న చోట్ల ఓటర్లు సిస్టమ్ నుంచి మాయమవుతున్నారని అన్నారు.
అలంద్, రాజురాలలో గతంలో ఇదే విధంగా జరిగిందని, ఎస్ఐఆర్ అమలు చేయబడిని గుజరాత్, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే బ్లూ ప్రింట్‌ను అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ఇకపై ప్రజాస్వామ్య రక్షకుడు కాదని, ఓట్ల దొంగతనం కుట్రలో కీలక భాగస్వామిగా మారిందని సంచలన ఆరోపణలు చేశారు. గుజరాత్ కాంగ్రెస్ కూడా ఈసీపై తీవ్ర ఆరోపణలు చేసింది. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై అభ్యంరాలకు చివరి తేదీ జనవరి 18గా పెట్టారని, జనవరి 15 వరకు తక్కువ సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయని , కానీ ఆ తర్వాత ఒక్కసారిగా ఫారమ్-7 ద్వారా లక్షల సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయని ఆరోపించింది. ఎన్నికల సంఘం డేటా ప్రకారం 12 లక్షల అభ్యంతరాలు వచ్చాయని చెప్పింది. ఒకే వ్యక్తి పేరుతో డజన్ల కొద్దీ అభ్యంతరాలు వచ్చినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
