Rahul Gandhi : 10వ రోజు రాహుల్ భారత్ జోడో యాత్ర.. విరాళాల వివాదం..

Rahul Gandhi : కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర.. పదోరోజు విజయవంతంగా ముగిసింది. రాత్రి ఏడు గంటలకు కరుణగపల్లిలో రాహుల్ పాదయాత్రను ముగించారు. రాత్రి కరుణగపల్లిలోనే బస చేస్తారు. ఇవాళ మొత్తం 25 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టిన రాహుల్‌గాంధీ.. రేపు అలప్పుజాలో పాదయాత్రను ప్రారంభిస్తారు.
భారత్‌ను ఏకం చేయడమే లక్ష్యంగా సాగుతున్న రాహుల్ పాదయాత్ర.. కేరళలో ఆరో రోజు ఉత్సాహంగా కొనసాగింది. ఉదయం ఆరున్నరకు కొల్లాం నుంచి పాదయాత్ర ప్రారంభించిన రాహుల్.. ఉదయం 11 గంటలకు నేందకరకు చేరుకున్నారు. ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులు, యువకులు, మహిళలు, రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలతో ముచ్చటిస్తూ.. ముందుకు కదిలారు. ఆ తర్వాత స్థానిక పారిశ్రామికవేత్తలతో సమావేశమై చర్చించారు. అనంతరం.. పలువురు కార్మికులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నేందకరలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో చర్చించాక మధ్నాహ్న భోజన విరామం తీసుకున్నారు. లంచ్ బ్రేక్ తర్వాత చవరా బస్టాప్ నుంచి తిరిగి పాదయాత్రను ప్రారంభించిన రాహుల్.. రాత్రి 7 గంటలకు కరుణగపల్లిలో ముగించారు.
కొల్లాంలో కాంగ్రెస్ కార్యకర్తలు విరాళాల కోసం స్థానిక కూరగాయల వ్యాపారిని బెదిరించడం వివాదానికి దారి తీసింది. దాంతో దిద్దుబాటు చర్యలకు దిగిన కాంగ్రెస్.. ముగ్గురు కార్యకర్తలను సస్పెండ్ చేసింది. విరాళాల కోసం బెదిరించడం తమ సిద్ధాంతం కాదని.. తాము స్వచ్ఛందంగానే చిన్న చిన్న విరాళాలతో క్రౌడ్ ఫండింగ్ చేపడుతున్నామని కేరళ పీసీసీ చీఫ్ సుధాకరన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. అటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఎంపీ జైరాం రమేష్ కూడా విరాళాల వివాదంపై స్పందించారు. కేరళ కాంగ్రెస్ పార్టీ గత కొన్నేళ్లుగా క్రౌడ్ ఫండింగ్ చేస్తోందన్నారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తక్షణం చర్యలు తీసుకున్నామని జైరాం రమేష్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com