Bharat Jodo Yatra : రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర'.. 23 రోజులు పూర్తి..

Bharat Jodo Yatra : భారత్ జోడోయాత్ర 23వ రోజు కర్ణాటకలోని బేగూర్ బస్టాప్ వద్ద ముగిసింది. రెండు రాష్ట్రాల్లో పూర్తయిన యాత్ర ఇవాళ మూడో రాష్ట్రం కర్ణాటకలోకి ఎంటరైంది. చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట్ వద్ద కర్ణాటకలో ప్రవేశించింది జోడోయాత్ర. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సీనియర్ కాంగ్రెస్ నేతలు కలిసి ఘన స్వాగతం పలికారు.
కర్ణాటకలోకి ఎంటరైన సందర్భంగా గుండ్లుపేటలో బహిరంగసభ ఏర్పాటు చేశారు. మరోవైపు భాషలు, సంస్కృతులు, మతాలను గౌరవించుకోవాలన్నారు రాహుల్‌గాంధీ. మోకాలి నొప్పి కొద్దిగా ఇబ్బంది పెడుతోందని,అయినా ప్రజలతో మాట్లాడుతూ ముందుకు సాగుతుంటే ఆ బాధ తెలియడం లేదని అన్నారు.రాహుల్ పాదయాత్రలో పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. వారికి అభివాదం చేసుకుంటూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. రాహుల్ గాంధీ యాత్ర 500 కిలోమీటర్ల మార్క్‌ను పూర్తి చేసుకుంది.
కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారు. తమిళనాడులోని కన్యాకుమారి వద్ద ప్రారంభమైన ఈ యాత్ర.. కేరళ మీదుగా కర్ణాటకలోకి ఎంటరైంది. అయితే కాంగ్రెస్ నేతలు దారిపొడవునా ఏర్పాటు చేసిన రాహుల్ పోస్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. చామరాజనగర్ జిల్లాలో రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లను చింపివేయడంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ఇది అధికార బీజేపీ పనేనని ఆరోపించింది.
23వ రోజు పాదయాత్ర రాహుల్ గాంధీ చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట్‌లోని ఊటీ-కాలీకట్ జంక్షన్ నుంచి ఉదయం 9గంటల 35 నిమిషాలకు ప్రారంభమైంది. ఉదయం 10.35 గంటలకు పంజాహెళ్లిలో మార్నింగ్ బ్రేక్ ఇచ్చారు.. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని ఆ తరువాత స్థానిక శనేశ్వర దేవాలయం దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానికులతో సమావేశం అయ్యారు రాహుల్.
తర్వాత మళ్లీ యాత్రను మొదలుపెట్టిన రాహుల్ మధ్యాహ్నాం వరకు బెండగెల్లి వరకు చేరుకున్నారు.బెండగెల్లి విలేజ్ గేట్ వద్ద రాహుల్ విరామం తీసుకున్నారు. లంచ్ బ్రేక్ తర్వాత సాయంత్రం ఐదు గంటలకు బెండగెల్లి విలేజ్ గేట్ నుంచి పాదయాత్రను మళ్లీ మొదలుపెట్టారు. వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి బేగూర్ బస్టాప్ వరకు చేరుకున్నారు రాహుల్ గాంధీ. ఇక రాత్రికి బేగూర్ విలేజ్ గ్రౌండ్‌లో రాహుల్ బస చేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com