Rahul Gandhi : రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' రెండవ రోజు..

Rahul Gandhi : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండవ రోజు..
Rahul Gandhi : కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేపట్టిన.. భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది

Rahul Gandhi : కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేపట్టిన.. భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. రెండోరోజు కన్యాకుమారి అగస్తీశ్వరం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. రాహుల్‌ వెంట రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్ బఘేల్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు నడిచారు. వేలాది మంది పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొన్నారు. రెండోరోజు మొత్తం 20 కిలోమీటర్లు నడిచిన రాహుల్.. రాత్రి 7 గంటలకు ముగించారు.

అగస్తీశ్వరంలోని వివేకానంద పాలిటెక్నిక్ కాలేజీలో ఉదయం 7 గంటలకు రాహుల్‌గాంధీ పాదయాత్రను ప్రారంభించారు. రెండు విడతలుగా పాదయాత్ర చేపట్టిన రాహుల్‌.. తొలుత ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు.. తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు పాదయాత్ర చేపట్టారు. ఇక పాదయాత్రలో భాగంగా రెండో రోజు కన్యాకుమారి వీధుల్లో రాహుల్ గాంధీ పర్యటించారు. స్థానిక ప్రజలు, మహిళలు, యువకులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరో రెండు రోజులు పాటు తమిళనాడులోనే రాహుల్‌గాంధీ పాదయాత్ర సాగనుంది.

సెప్టెంబర్ 11న కేరళ రాష్ట్రంలోని కలియిక్కవిలాలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. సెప్టెంబర్ 29 వరకు కేరళలోని 12 లోక్ సభ, 42 అసెంబ్లీ స్థానాల్లో రాహుల్ పాదయాత్ర చేపట్టనున్నారు. అలాగే కేరళలోని త్రిసూర్ ప్రాంతంలో కాంగ్రెస్ తలపెట్టిన భారీ ర్యాలీలో రాహుల్ ప్రసంగించనున్నారు. మోదీ 8 ఏళ్ల పాలన, దేశంలో పెరిగిన అన్ని రకాల ధరలు, జీఎస్టీ పన్ను భారాలు, బీజేపీ చేస్తున్న మత విద్వేష రాజకీయాలే లక్ష్యంగా రాహుల్ విమర్శలు గుప్పిస్తున్నారు.

మరోవైపు రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం వస్తుందని హస్తం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి.. జాతీయ రాజకీయాల్లోనే తొలిసారిగా రాహుల్ చేపట్టిన ఈ పాదయాత్ర.. కాంగ్రెస్‌కు ఎంతవరకు మైలేజీ ఇస్తుందో చూడాలి.

Tags

Next Story