Rahul Gandhi: అస్సాంలోని ఆలయానికి రాహుల్ ను అంగీకరించని పోలీసులు

అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ వేళ అసోంలో శ్రీశ్రీశంకర్ దేవ్ సత్రా ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్ ను కాకుండా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలను అనుమతించారు. అసోం ప్రభుత్వ తీరుపై రాహుల్, కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నాగావ్ లో ఉన్న ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్తుండగా తనను అధికారులు అడ్డుకోవడంపై రాహుల్ మండిపడ్డారు. ఎవరు ఆలయాన్ని సందర్శించాలో
ప్రధాని మోదీ నిర్ణయిస్తారా అని ఆయన ప్రశ్నించారు. తాము ఎలాంటి ఇబ్బందులు సృష్టించాలని అనుకోవడంలేదని రాహుల్ చెప్పారు. ఆలయంలో ప్రార్థనలు మాత్రమే చేస్తామని వివరించారు. అధికారులు మాత్రం రాహుల్ గాంధీని. మధ్యాహ్నం 3 గంటల తర్వాతే ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఇస్తామని చెప్పారు. ఈ మేరకు రాహుల్ సహా కాంగ్రెస్ నేతలను నాగావ్ లోని శంకర్ దేవ్ ఆలయానికి 20కిలోమీటర్ల దూరంలోని హైబోరగావ్ వద్దే నిలిపివేశారు.భారీకేడ్లు పెట్టి భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.
తనను ఎందుకు అడ్డుకున్నారని రాహుల్ ప్రశ్నించగా.. పర్యటనతో ఘర్షణలు జరగవచ్చని అధికారులు సమాధానం ఇచ్చారు. వారి తీరుపట్ల రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. "నేనేం తప్పు చేశాను. మేం ఆలయాన్ని దర్శించుకోవాలనుకుంటున్నాం. నేనేమైనా నేరం చేశానా. మేం ఆ ప్రాంతంలో ఎలాంటి ఘర్షణలు సృష్టించాలనుకోవట్లేదు. కేవలం ఆలయంలో పూజలు చేసి రావాలనుకుంటున్నాం" అని రాహుల్ అన్నారు. ఆలయాన్ని ఎవరు సందర్శించాలనేది ప్రధాని మోదీ నిర్ణయిస్తారని ఎద్దేవా చేశారు. రాహుల్‌కి ఆలయ ప్రవేశాన్ని నిరాకరించడంపై శ్రీ గాంధీ నాగోన్‌లో కాంగ్రెస్ నేతలు నిరసనలు తెలిపారు. దీనిపై అసోం సీఎం హిమంత బిస్వ శర్మ మాట్లాడుతూ.. "ఓ వైపు అయోధ్యలో రామ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుండగా.. రాహుల్ గాంధీ అసోంలోని బటద్రవ సత్ర ఆలయాన్ని సందర్శిస్తే రెండు ఆలయాల మధ్య పోటీగా ప్రజలు భావిస్తారు. అది రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదు" అని అన్నారు. కాగా ఆదివారం రాహుల్ రోడ్ షో జరుగుతుండగా బీజేపీ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ వారితో మాట్లాడాలని ప్రయత్నించగా భద్రతా దళాలు ఆయన్ని వారించాయి. దీంతో బస్సులోనే ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com