Parliament Sessions: రాహుల్ రెండో ప్రసంగం కూడా వివాదాస్పదమే, సభలో పోస్టర్ ప్రదర్శనకు యత్నం
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన రెండో ప్రసంగం కూడా వివాదాస్పదమైంది. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సోమవారం లోక్‌సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలోని కొన్ని పదాలను రికార్డు నుంచి తొలగించారు. గతంలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా కూడా రాహుల్ గాంధీ ప్రసంగంపై సభలో గంధరగోళం నెలకొంది. తొలి ప్రసంగంలో రాజ్యాంగ ప్రతిని, శివుడి బొమ్మను చూపుతూ రాహుల్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దీనిపై స్పీకర్ ఓం బిర్లా కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా అలాంటి ఘటనే మరోసారి చోటుచేసుకుంది. ఈ సారి కూడా ప్రతిపక్షనేత ఓ పోస్టర్ ను పార్లమెంట్ లో ప్రదర్శించేందుకు యత్నించారు.
రాహుల్ గాంధీ ‘హల్వా’ వేడుక గురించి ప్రస్తావించారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్న ‘హల్వా’ వేడుకకు సంబంధించిన పోస్టర్‌ను సభలో ప్రదర్శించారు. ఈ ఫోటోలో దళిత, ఆదివాసీ, ఓబీసీలకు చెందిన అధికారిని చూడలేదని.. అలాంటి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఏం ప్రయోజనం చేకూరుస్తుందని మండిపడ్డారు. ఈ 20 మంది అధికారులు బడ్జెట్ సిద్ధం చేశారని చెప్పారు. అయితే, రాహుల్ వ్యాఖ్యలకు సభలో ఉన్న నిర్మలమ్మ తల బాదుకున్నారు. సభలో పోస్టర్ ప్రదర్శించడంపై స్పీకర్ ఓంబిర్లా అభ్యంతరం తెలిపారు.
రాహుల్ వ్యాఖ్యలపై సభలో తీవ్ర దుమారం రేగింది. పోస్టర్ ను ప్రదర్శించేందుకు యత్నించిన రాహుల్ గాంధీని స్పీకర్ ఓంబిర్లా సానుకూలంగా తిరస్కరించారు. స్పీకర్ సమాధానమిస్తూ.. ” మీరు ప్రతిపక్ష నేత.. గతంలో కూడా ఫొటోలు, పోస్టర్ లు సభలో ప్రదర్శించొద్దని మీకు చెప్పాను. ఇది సభ నియమాలకు విరుద్ధం.” అని పేర్కొన్నారు. మరోవైపు అధికార బీజేపీ నేతలు రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడీవేడీ వాదన సాగింది. రాహుల్ గాంధీకి సభా నియమాలు తెలియవంటూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com