Rahul Gandhi: ఏం చేసుకున్నా.. మోదీకి భయపడేది లేదు: రాహుల్ గాంధీ

Rahul Gandhi: ఈడీ తీరుపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసులతో తమను భయపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు రాహుల్. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏం చేసుకున్నా.. తాము భయపడేది లేదని రాహుల్ స్పష్టం చేశారు.
ఈడీ సోదాలు, దాడులు, విచారణల పేరిట విపక్షాల గొంతును నొక్కేందుకు కేంద్రం యత్నిస్తోందని కూడా రాహుల్ గాంధీ ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసు పూర్తిగా బెదిరింపు చర్యేనని రాహుల్ తేల్చేశారు. తమపై ఒత్తిడి తీసుకుని వస్తే.. తామంతా సైలెంట్‌గా ఉంటామని మోడీ, అమిత్ షా భావిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. అది ఎప్పటికీ జరగదని చెప్పారు.
కాంగ్రెస్ పత్రిక నేషనల్ హెరాల్డ్‌కు చెందిన ఆస్తుల వ్యవహారంపై కేసు నమోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇప్పటికే ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను రోజుల తరబడి విచారించారు. ఈ కేసులో భాగంగా మంగళ, బుధ వారాల్లో నేషనల్ హెరాల్డ్ పత్రిక కార్యాలయాల్లో సోదాలు చేసిన ఈడీ... ఆ కార్యాలయంలో ఉన్న యంగ్ ఇండియా కార్యాలయాన్ని సీజ్ చేసింది.
బుధవారం యంగ్ ఇండియా కార్యాలయాన్ని సీజ్ చేసిన ఈడీ.. గురువారం కాంగ్రెస్ పార్టీ కీలకనేత మల్లికార్జున ఖర్గెను ఈడీ అధికారులు విచారించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దర్యాప్తు, యంగ్ ఇండియా కార్యాలయం సీజ్ తదితరాలపై పార్టీ కీలక నేతలతో జరిగిన భేటీలో ఖర్గే కూడా పాలుపంచుకున్నారు. ఆ తర్వాతే ఆయనను ఈడీ అధికారులు విచారణకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఇలా ఈడీ.. నేషనల్ హెరాల్డ్ కేసులో రోజుకో ముందడుగు వేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com