Rahul Gandhi : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు విశేష స్పందన..

Rahul Gandhi : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు విశేష స్పందన..
Rahul Gandhi : రాహుల్ గాంధీ 20వ రోజు యాత్ర కేరళలోని తాచింగనదంలో ముగిసింది

Rahul Gandhi : రాహుల్ గాంధీ 20వ రోజు యాత్ర కేరళలోని తాచింగనదంలో ముగిసింది. తాచింగనదంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో రాహుల్ గాంధీ బీజేపీ తీరుపై విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం రైతులను చిన్న చూపు చూస్తోందంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. బడా పారిశ్రామిక వేత్తలకు కోట్ల రూపాయలను మాఫీ చేస్తున్న కేంద్రం.. రైతులను మాత్రం ఎగవేతదారులుగా ప్రకటిస్తోందని ఆరోపించారు. బీజేపీకి రైతుల కంటే బడా వ్యాపారులే ముఖ్యమా? అంటూ రాహుల్‌ ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ 20వ రోజు పాదయాత్ర పామాలప్పురంలోని పులమంతోల్‌ జంక్షన్‌ నుంచి ప్రారంభమైంది. ఉదయం 6గంటల 30నిమిషాలకు పాదయాత్ర మొదలుపెట్టారు రాహుల్‌. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.. 11 గంటలకు MSTM ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజ్‌ దగ్గర మార్నింగ్‌ బ్రేక్‌ ఇచ్చారు.. మార్నింగ్ సెషన్ యాత్ర 14 కిలోమీటర్ల వరకు సాగింది. అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకొని ఆ తరువాత కాంగ్రెస్‌ కార్యకర్తలు, స్థానికులతో సమావేశం అయ్యారు రాహుల్‌.

తిరిగి సాయంత్రం 4 గంటలకు MSTM ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజ్‌ నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. రాహుల్ వెంట వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు సాగారు. స్థానికుల స్వాగతాలతో, నాయకుల సంఘీభావంతో పాలక్కాడ్‌లోని తాచింగనదం వరకు ఈ యాత్ర కొనసాగింది. కాగా ఇప్పటివరకు రాహుల్ గాంధీ 450 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర పూర్తి చేశారు.

రాహుల్‌ రోజురోజుకి ఉత్సాహంగా పాదయాత్ర సాగిస్తున్నారు. అటు స్థానికులను కలసి సమస్యలను తెలుసుకుంటున్నారు..ఇటు కాంగ్రెస్‌ కేడర్‌కి దిశానిర్ధేశం చేస్తూ ముందుకుసాగుతున్నారు రాహుల్‌.రాహుల్ పాదయాత్రలో పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. వారికి అభివాదం చేసుకుంటూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. చిన్నారులు, పెద్దలు రాహుల్ తో కరచాలనం చేసేందుకు పోటీపడుతున్నారు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఇక రాత్రిపాలక్కాడ్‌లోని తాచింగనదం హైస్కూల్‌లో రాహుల్ బస చేయనున్నారు. బుధవారం తాచింగనదం నుంచి తిరిగి యాత్రను ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 10న సాయంత్రం కేరళలో అడుగుపెట్టిన యాత్ర అక్టోబర్ 1న కర్ణాటకలో ప్రవేశించనుంది. వాయినాడ్‌ రాహుల్‌ నియోజకవర్గం కావడంతో ఈ ప్రాంతంలో ఎక్కువ రోజులు పాదయాత్ర కొనసాగేలా ప్లాన్‌ చేసింది జోడో యాత్ర టీం.

Tags

Next Story