Kiren Rijiju : దేశ భద్రతకు రాహుల్ ముప్పు : కేంద్రమంత్రి రిజిజు

Kiren Rijiju : దేశ భద్రతకు రాహుల్ ముప్పు  : కేంద్రమంత్రి రిజిజు
X
రాహుల్ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్న నిషికాంత్ దూబే

లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ భారత వ్యతిరేక శక్తులతో సంబంధాలు పెట్టుకున్నారని ఆరోపించారు. దేశ భద్రతకు రాహుల్ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని మండిపడ్డారు. దేశీయంగా, విదేశీ పర్యటనల్లో రాహుల్ నక్సలైట్లు, తీవ్రవాదులు, జార్జ్ సోరోస్ వంటి దేశ వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తులతో సమావేశాలు జరుపుతున్నారని ఆరోపించారు.

దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపే ఆయన జాతీయ భద్రతకు చాలా ప్రమాదకరమని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిజిజు ఈ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్షాలు సిద్ధమవడంపై కూడా రిజిజు మాట్లాడారు. ప్రతిపక్షాలపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ నేతలు, ముఖ్యంగా రాహుల్‌గాంధీ వారి వ్యాఖ్యలతో చర్చలకు అంతరాయం కలిగిస్తారని అన్నారు.

దేశ చరిత్రలో ఎప్పుడూ ఆయనలాంటి ప్రతిపక్ష నేతను చూడలేదని రిజిజు విమర్శించారు. పార్లమెంట్‌ సమావేశాలు జరగనీయకూడదనే ఉద్దేశంతో కాగితాలు విసిరేయడం, నినాదాలు చేస్తూ వాకౌట్‌ చేయడం వంటి చిన్న పిల్లల చర్యలు చేస్తుంటారని అసహనం వ్యక్తంచేశారు. రాహుల్‌గాంధీ ఇలా సభకు అంతరాయం కలిగించడంవల్ల ప్రజల సమస్యల గురించి మాట్లాడాలనుకునే వారికి అవకాశం దక్కట్లేదని చెప్పారు.

అమెరికా ప్రభుత్వానికి భారత్‌ తలొగ్గిందని, జాతీయ ప్రయోజనాలతో రాజీ పడుతోందని ఇటీవల లోక్‌సభలో రాహుల్‌ ఆరోపించారు. అయితే రాహుల్‌ తన వ్యాఖ్యలతో దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని బీజేపీ పార్లమెంట్‌ సభ్యుడు నిషికాంత్ దూబే విమర్శించారు. ఫిబ్రవరి 12న లోక్‌సభలో రాహుల్‌కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాహుల్‌ పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని కోరారు. ఈ నేపథ్యంలో రాహుల్‌పై కిరణ్‌ రిజిజు తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Tags

Next Story