RAHUL: రాహుల్‌గాంధీపై అనర్హత ఎత్తివేత

RAHUL: రాహుల్‌గాంధీపై అనర్హత ఎత్తివేత
X
నోటిఫికేషన్‌ జారీ చేసిన లోక్‌సభ సచివాలయం... మళ్లీ ఎంపీ అయిన కాంగ్రెస్‌ అగ్రనేత

పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి విధించిన రెండేళ్ల జైలుశిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఆయనపై వేసిన అనర్హతను ఎత్తివేస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. నిషేధం ఎత్తివేతతో రాహుల్‌ గాంధీ మళ్లీ లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు. మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యల కేసులో ఆయనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై ఇటీవల సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాహుల్‌ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌తో రాహుల్‌ మళ్లీ ఎంపీ అయ్యారు.


సభ్యత్వాన్ని పునరుద్ధరించడంతో రాహుల్‌ సోమవారం నాటి సమావేశాలకు హాజరుకానున్నారు. ఇక, ప్రధాని మోదీ సర్కారుపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (No-Confidence Motion)పై ఆగస్టు 8 నుంచి లోక్‌సభలో చర్చ జరగనుంది. ఈ చర్చలోనూ రాహుల్ పాల్గొననున్నారు.

2019లో కర్ణాటకలో జరిగిన ఓ ఎన్నికల సభలో మోదీ ఇంటిపేరుపై రాహుల్‌ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పూర్ణేశ్‌ మోదీ పరువు నష్టం దావా వేశారు. దీంతో సూరత్‌ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల శిక్ష విధించింది. ఫలితంగా ప్రజా ప్రాతినిథ్య చట్టం కింద ఆయనపై అనర్హత వేటు పడింది. దీంతో ఆయన లోక్‌సభ సభ్వత్వాన్ని కోల్పోయారు. ఈ క్రమంలోనే శిక్షపై స్టే విధించాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు కొట్టేయగా.. దీన్ని సవాలు చేస్తూ రాహుల్‌ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం.. ఆయనకు పడిన రెండేళ్ల శిక్షపై స్టే విధించింది. రాహుల్‌పై పరువునష్టం కేసులో సుప్రీంకోర్టు స్టే విధించడంతో కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. రెండేళ్లు అంతకంటే ఎక్కువకాలం జైలు శిక్ష పడితే.. ఆ తీర్పు వచ్చిన రోజు నుంచే అనర్హత అమల్లోకి వస్తుంది. దీంతో వారి సభ్యత్వం రద్దవుతుంది. అంతేగాక, జైలు నుంచి విడుదలైన తర్వాత మరో ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికీ వీలుండదు.

Tags

Next Story