Rahul Gandhi: మోడీపై రాహుల్ సంచలన ఆరోపణలు

Rahul Gandhi: మోడీపై రాహుల్ సంచలన ఆరోపణలు
రాజ్యాంగాన్ని మార్చేంత ధైర్యం బిజెపి కే లేదన్న రాహుల్‌ గాంధీ

ED, EVMలు, సీబీఐ, ఐటీల సాయం లేకుండా ప్రధాని మోదీ ఎన్నికల్లో గెలవలేరనీ అవినీతిపై ఆయనదే గుత్తాధిపత్యమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ముంబయిలో భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభలో ప్రసంగించిన ఆయన.. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, విద్వేషాలను చూపేందుకే యాత్ర చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సభకు హాజరయిన ఇండియా కూటమి నేతలు.. ఈ ఎన్నికల్లో కేంద్రంలో అధికారం తమదేననీ లౌకిక, సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తంచేశారు.

ఎన్నికల బాండ్లతో భాజపా అవినీతి బయటపడిందని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. ఈ పదేళ్లలో విదేశీ పర్యటనలు, దుష్ప్రచారం తప్ప మోదీ వేరే ఏం చేయలేదన్నారు. విపక్షాలను అవినీతిపరులుగా ముద్ర వేయడం ప్రారంభించారని మండిపడ్డారు. దేశంలో మార్పు తేవాల్సిన అవసరం ఉందని, భాజపాను కలిసికట్టుగా గద్దె దించాలని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సూచించారు. తమ పోరాటం విద్వేష భావజాలంపైనే గానీ మోదీ, షాలపై కాదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. ప్రజలు ఏకమైతేనే నియంతృత్వం అంతం అవుతుందని UBT శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. దేశ రక్షణకే తాము ఏకమయ్యామని, రాజ్యాంగ మార్పు కోసమే భాజపా 400కుపైగా సీట్లు కావాలంటోందని జమ్ము కశ్మీర్ నేతలు.. ఫరూక్ అబ్దుల్లా, ముఫ్తీ పేర్కొన్నారు. జైలుకెళ్లేందుకు తమకు భయం లేదని అందుకే ఐక్యంగా ఉన్నామని దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ వివరించారు. కుట్ర చేసి తన భర్తను జైల్లో పెట్టారని ఝార్ఖండ్ మాజీ CM, హేమంత్ సోరెన్ సతీమణి కల్పన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదివారం ప్రియాంకగాంధీతో కలిసి ముంబయిలో ‘జోడో న్యారు సంకల్ప్‌ పాదయాత్ర’ నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ మాట్లాడారు. సత్యం, ప్రజల మద్దతు తమవైపే ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం జరుగుతోన్న యుద్ధం బిజెపి, కాంగ్రెస్‌ల మధ్య మాత్రమే కాదని, రెండు సిద్ధాంతాల మధ్య పోటీ నెలకొందని అన్నారు. అధికారం మొత్తం ఒకే దగ్గర ఉండాలని ఆ పార్టీ కోరుకుంటోందని, అధికార వికేంద్రీకరణ జరగాలని, ప్రజల గొంతుకను వినిపించాలని తాము భావిస్తున్నామని తెలిపారు. జ్ఞానం ఒకరి దగ్గరే ఉంటుందని, రైతులు, కార్మికులు, నిరుద్యోగ యువతకు జ్ఞానం ఉండదని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు భావిస్తున్నాయని విమర్శించారు. ఓ వ్యక్తి ఐఐటి డిగ్రీ పొందినంత మాత్రాన అతను రైతు కంటే ఎక్కువ తెలివైనవాడని కాదని రాహుల్‌ గాంధీ అన్నారు. జనవరి 14న మణిపూర్‌లో ప్రారంభించిన భారత్‌ జోడో న్యారు యాత్రను 63వ రోజైన శనివారం సాయంత్రం ముంబయిలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ సార్మకం ‘ఛైత్యభూమి’ వద్ద ముగించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌కు నివాళులర్పించారు. రాజ్యాంగ ప్రవేశికను చదివారు.

Tags

Next Story