Rahul Gandhi : రాహుల్‌పై పరువునష్టం కేసులో సుప్రీం స్టే..

భారత సైన్యం, దేశ భద్రతపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. "మీరు నిజమైన భారతీయులైతే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు" అంటూ ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. చైనా మన దేశ భూభాగాన్ని ఆక్రమించిందంటూ రాహుల్ చేసిన ఆరోపణలకు సంబంధించి దాఖలైన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. "మీరు ప్రతిపక్ష నేత. పార్లమెంటులో చెప్పాల్సిన విషయాలను సోషల్ మీడియాలో ఎందుకు ప్రస్తావిస్తారు? 2,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని మీకు ఎలా తెలుసు?" అని రాహుల్ గాంధీని ఉద్దేశించి ధర్మాసనం ప్రశ్నించింది. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన విషయాలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికింది.
2022 డిసెంబర్‌లో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గల్వాన్ ఘర్షణల తర్వాత చైనా సుమారు 2,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఓ రిటైర్డ్ రక్షణ అధికారి లక్నో కోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారణను రద్దు చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను గతంలో అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది.
దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం, లక్నో కోర్టులో జరుగుతున్న విచారణపై స్టే విధిస్తూ రాహుల్ గాంధీకి తాత్కాలిక ఊరట కల్పించింది. అయితే, ఆయన చేసిన వ్యాఖ్యల తీరును మాత్రం తీవ్రంగా తప్పుబట్టింది. జాతీయ నాయకులు బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com