MANIPUR: నేడు మణిపూర్‌కు రాహుల్‌గాంధీ
హింసాత్మక ఘటనలతో అతలాకుతలమవుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో నేడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. మణిపూర్‌లోని సహాయ పునరావాస కేంద్రాల్లో అవస్థలు పడుతున్న స్థానికులను రాహుల్ పరామర్శిస్తారు. ఇంఫాల్, చురచంద్‌పుర్‌లలో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలను రాహుల్ సందర్శించి అక్కడ పౌర సమాజ ప్రతినిధులతో చర్చిస్తారని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. మణిపూర్ రెండు నెలలుగా హింసాత్మక ఘటనలతో అతలాకుతలం అవుతోందని... సమాజాన్ని ఘర్షణ నుంచి శాంతి మార్గం వైపు పయనించేలా చేయడం అవసరం హస్తం పార్టీ వెల్లడించింది. ద్వేషంతో కాకుండా ప్రేమగా కలిసి ఉండడం మన బాధ్యతని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.
నేడు, రేపు రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటిస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు. ఈశాన్య రాష్ట్రంలో ప్రశాంతత వెల్లివిరియాలంటే సమాజంలో శాంతి అవసరమని కేసీ వేణుగోపాల్ అన్నారు. మే 3న మణిపూర్‌లో హింస చెలరేగినప్పటి నుంచి రాష్ట్రంలో పరిస్థితిపై ప్రతిపక్షాలు నిరంతరం ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.విపక్షాలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. ఈ పార్టీలు ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు ముందు అపాయింట్‌మెంట్ కోరాయి. దీని తర్వాత అన్ని పార్టీలు కలిసి మణిపూర్‌పై మెమోరాండం జారీ చేశాయి.
వీటన్నింటి మధ్య హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్ష పార్టీల సమావేశ నిర్వహించి.... మణిపూర్‌లో పరిస్థితి త్వరలో సాధారణ స్థితికి వస్తుందని హామీ ఇచ్చారు. మణిపూర్ పరిస్థితిపై అమిత్ షా సమీక్ష నిర్వహించిన తర్వాత రాహుల్ గాంధీ మణిపూర్‌లో పర్యటించాలని నిర్ణయించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఐదు రోజుల అమెరికా, ఈజిప్టు పర్యటన నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత మణిపూర్‌లో పరిస్థితిని సమీక్షించారు. మణిపుర్‌లో చెలరేగిన అల్లర్లకు కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి జాతుల మధ్య నెలకొన్న వైరమే కారణం. రాష్ట్రంలో మెజారిటీలుగా ఉన్న మెయిటీలకు గిరిజనులహోదా కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై గిరిజన సంస్థలు ఆందోళనలను ఉద్ధృతం చేశాయి. అవి నిర్వహించిన సంఘీభావయాత్ర హింసాత్మక ఘటనలకు దారితీసింది. కొన్నిరోజుల పాటు రాష్ట్రం మండిపోయింది. ఆ ఘటనల్లో దాదాపు 100మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ, పారామిలిటరీ, పోలీసులను మోహరించి, కొద్దిరోజుల తర్వాత పరిస్థితిని అదుపులోకి తేగలిగారు. కానీ మళ్లీ అక్కడి వాతావరణం మొదటికొచ్చేలా కనిపిస్తోంది. మణిపూర్ జనాభాలో 53 శాతం మెయిటీ కమ్యూనిటీకి చెందిన వారు ఉన్నారు. నాగాలు, కుకీలు వంటి గిరిజనులు జనాభాలో 40 శాతం ఉన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com