Rahul Gandhi: భారత్ న్యాయ యాత్రకు సిద్ధమైన రాహుల్

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. తాజాగా రెండో విడతలో ‘భారత్ న్యాయ యాత్ర’పేరుతో 14 రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ యాత్ర జనవరి 14న ప్రారంభమై మార్చి 20న ముగియనుంది. మణిపూర్ నుంచి ముంబై వరకూ సుమారు 85 జిల్లాల మీదుగా ఈ యాత్ర సాగనుంది. భారత్ న్యాయ యాత్రను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే జెండా ఊపి ప్రారంభించనున్నారు. రాహుల్ ఈ యాత్రను బస్సు, కాలి నడకన కొనసాగించనున్నారు.
కాగా, రాహుల్ గతేడాది ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 7, 2022న ప్రారంభమైన ఈ యాత్ర ఈ ఏడాది జనవరి 30న ముగిసింది. సుమారు 12 రాష్ట్రాల మీదుగా రాహుల్ పాదయాత్ర చేశారు. 145 రోజుల (దాదాపు 5 నెలలు) పాటు సాగిన ఈ సుదీర్ఘ యాత్ర దాదాపు 3970 కి.మీ మేర సాగింది.
ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన చేశారు. భారత్ జోడో యాత్రలో ఎదురైన అనుభవాలతో రెండోసారి రాహుల్ గాంధీ పాదయాత్రను ప్రారంభించనున్నారని చెప్పారు. ఈ సారి యువత, మహిళలతో పాటు అన్ని వర్గాలతోనూ ఆయన మాట్లాడతారాని, మొత్తం 6,200 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుందన్నారు. మణిపూర్, నాగాలాండ్, అసోం, మేఘాలయా, పశ్చిమ బెంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మీదుగా యాత్ర సాగుతుంది. చివరకు మహారాష్ట్రలో ముగుస్తుంది. ఈ సారి కాలినడకనే కాకుండా బస్‌లో యాత్ర కొనసాగుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com