ODISHA: మానవ తప్పిదం వల్లే ఒడిశా రైలు ప్రమాదం

ODISHA: మానవ తప్పిదం వల్లే ఒడిశా రైలు ప్రమాదం
ఒడిశా రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణం...రైల్వే సేఫ్టీ కమిషనర్‌ నివేదికలో సంచలన విషయాలు...

ఒడిశా బాలాసోర్‌ రైలు ప్రమాద దుర్ఘటనకు మానవ తప్పిదమే కారణమని రైల్వే సేఫ్టీ కమిషనర్‌ నివేదిక స్పష్టం చేసింది. జూన్‌ 2న ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 293 మంది మరణించగా వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి గల కారణాలను వెలికితీసేందుకు రైల్వే శాఖ కమిటీని వేసింది. ఓవైపు సీబీఐ విచారణ జరుగుతుండగానే దుర్ఘటనపై విచారణ చేసిన రైల్వే సేఫ్టీ చీఫ్‌ కమిషనర్‌ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ సంచలన విషయాలు బహిర్గతం చేసింది. ఉద్యోగుల అజాగ్రత్త వల్లే 3 రైళ్లు ఢీకొని ఈ దుర్ఘటన చోటు చేసుకుందని నివేదిక పేర్కొంది.


సిగ్నలింగ్‌, టెలి కమ్యూనికేషన్‌ విధుల్లో ఉన్న ఉద్యోగులు సరైన విధంగా స్పందించకపోవడం వల్లే ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా బహానగాలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం జరిగినట్లు కమిషన్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ నివేదిక రూపొందించింది. దానికి సంబంధించి రైల్వే శాఖ ఉన్నతాధికారులకు నివేదికను కూడా అందజేసింది. విధ్వంసం, సాంకేతిక లోపం వంటి అవకాశాలను తోసిపుచ్చింది. మూడేళ్ళ కిందట భద్రతా కారణాల దృష్ట్యా సిగ్నల్‌ వ్యవస్థలో మార్పులు జరిగినట్లు తెలిపింది. అయితే కొంత మంది గ్రౌండ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ వ్యవస్థ తనిఖీలో తగిన భద్రతా విధానాలు అనుసరించలేదని నివేదిక ఆరోపించింది. సంబంధిత సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించడంతోనే లూప్‌లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టిందని తెలిపింది. ఆ తర్వాత దాని బోగీలు పక్క ట్రాక్‌పై పడగా.. అటుగా వస్తున్న మరో రైలు ఢీకొట్టి పట్టాలు తప్పినట్లు అందులో పేర్కొంది.

సిగ్నలింగ్ విభాగంలోని భద్రతా ప్రక్రియలను పర్యవేక్షించే అధికారులతోపాటు డిజైన్‌ మార్పులను అనుసరించని ఇతర సిబ్బంది నిర్లక్ష్యం కూడా కారణమని రైల్వే సేఫ్టీ కమిషనర్‌ నివేదిక పేర్కొంది. వార్షిక తనిఖీల్లో కూడా దీనిని గుర్తించలేదని... కాబట్టి ఈ ప్రమాదం కేవలం ఒక వ్యక్తి లోపం కాదని.. కనీసం ఐదుగురు వ్యక్తుల తప్పిదం ఉందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అధికారులు తయారు చేసిన నివేదిక మాత్రం రైల్వే శాఖ బయట పెట్టడం లేదు. ఈ ఘోర రైలు ప్రమాదంపై సీబీఐ అధికారుల బృందం దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలోనే నివేదికను బహిర్గతం చేయడం లేదని తెలుస్తోంది. ఒడిశా రైలు ప్రమాదంలో ఏదైనా కుట్ర కోణం ఉందా అన్న కోణంలో సీబీఐ బృందం దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా రైల్వే శాఖ ఉద్యోగులు, సిబ్బంది సహా పలువురిని ఇప్పటికే సీబీఐ అధికారులు విచారణ జరిపారు.

Tags

Read MoreRead Less
Next Story