Rain alert:మరో అయిదు రోజులు భారీ వర్షాలు

రుతు పవనాల ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరించిన కాసేపటికే దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షం ముంచెత్తింది. ఇవాళ కురిసిన భారీ వర్షానికి ముంబైలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు జలమయం కావడంతో ట్రాఫిక్ స్తంభించింది. రేపటి వరకు ముంబైకి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ హెచ్చరిక జారీ చేసింది. ముంబైతో పాటు థానే, రాయ్‌గఢ్, రత్నగిరి, నాసిక్, పూణే, సతారా జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
మహారాష్ట్రతో పాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతవరణ శాఖ హెచ్చరించింది. రాబోయే ఐదు రోజుల్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. జూలై 5 వరకు ఉత్తరాఖండ్ అంతటా కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
రాబోయే రోజుల్లో డెహ్రాడూన్‌తో పాటు ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ ప్రకటించారు. వర్షం సమయంలో ప్రయాణించకుండా ఉండాలని వాతావరణ శాఖ డైరెక్టర్ బిక్రమ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు భారీ వర్షాల దృష్ట్యా ఉత్తరాఖండ్ యంత్రాంగం అప్రమత్తమైంది. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను అమర్‌నాథ్ యాత్ర మార్గంలో, అలాగే సున్నితమైన విపత్తుల సమయంలో మోహరించినట్లు అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్‌లో ఎనిమిది జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com