RAINS IN INDIA: ఎటుచూసినా విధ్వంసమే
కుంభవృష్టితో అస్తవ్యస్తమైన హిమాచల్‌ప్రదేశ్‌లో వరద విలయం కొనసాగుతూనే ఉంది. హిమాచల్‌లోని మూడు జిల్లాలో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. కొన్ని రోజుల నుంచి పోటెత్తిన వరదలబారినపడి చనిపోయినవారి సంఖ్య 31కి చేరింది. హిమాచల్‌లో ఎటు చూసినా వరద సృష్టించిన విధ్వంసమే కనిపిస్తోంది. రూ. 3000 కోట్ల నుంచి రూ.4000 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ఈ నష్టం భారీగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. మూడు రోజులు కుండపోతగా కురిసిన వర్షాలకు సిమ్లా-కల్కా, మనాలి-చండీగఢ్, జాతీయ రహదారులు సహా 12 వందల 39 రోడ్లు మూసుకుపోయినట్టు హిమాచల్ అత్యవసర ఆపరేషన్ కేంద్రం ప్రకటించింది. 14 వందల 16 రూట్లలో బస్సు సర్వీసులను నిలిపివేయగా 679 బస్సులు వరదల్లో చిక్కుకుపోయినట్లు హిమాచల్ ఆర్టీసీ తెలిపింది. కొండచరియలు విరిగిపడటం, రోడ్లు కొట్టుకుపోవడం వల్ల సరుకుల రవాణకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. రోడ్డు పునరుద్ధరణ బాధ్యతలను ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌కుఅప్పగించినట్లు అధికారులు తెలిపారు. వారికి పోలీసులు, స్థానికులు సహకరిస్తున్నట్లు వెల్లడించారు.
భారీ వర్షాలకు 2, 577 ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులకు గురవగా కులు, మండిలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయినట్టు అధికారులు తెలిపారు. సిమ్లా సహా చాలా ప్రాంతాల్లో 14 వందల 18 నీటి సరఫరా వ్యవస్థలు దెబ్బతినగా తాగునీటికీ ప్రజలు అల్లాడే పరిస్థితి ఏర్పడింది. మొబైల్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. గతరాత్రి నుంచి వానలు తెరిపినివ్వగా నదుల్లో నీటిమట్టం తగ్గుతోందని, సహాయ చర్యలు, రోడ్ల పునరుద్ధరణ పనులు వేగవంతం చేసినట్టు అధికారులు తెలిపారు.
హిమాచల్‌లో వర్షానంతర పరిస్థితులపై సీఎం సుఖ్‌విందర్ సింగ్ సుఖు ఏరియల్ సర్వే నిర్వహించారు. కులు, లాహౌల్, స్పితి, మండి ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలిచారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మరోవైపు రాజధాని దిల్లీ సహా పంజాబ్ హరియాణా, ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్‌లలో నదుల ఉదృతికి పలుచోట్ల రోడ్లు తెగాయి. భవనాలు, వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. పంజాబ్‌లో విద్యాసంస్థలకు రేపటి వరకూ సెలవులు ప్రకటించారు.
దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది పదేళ్ల తర్వాత గరిష్ఠ నీటి మట్టాన్ని నమోదు చేసింది. యమునా నదిలో నీటి మట్టం అనూహ్యంగా పెరుగుతోందని అధికారులు తెలిపారు. న్యూఢిల్లీలోని ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద నీటి మట్టం ఇవాళ ఉదయం 5 గంటలకు 207 మీటర్లు దాటిందని సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపింది.యమునా నది ప్రమాద మార్కు 205 మీటర్లు కాగా దానికంటే రెండు మీటర్లపైనే నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. యమునా నది నీటి మట్టాన్ని పర్యవేక్షించేందుకు 16 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. రెస్క్యూ-అండ్-రిలీఫ్ ఆపరేషన్ల కోసం 50కుపైనే మోటర్ బోట్‌లను మోహరించారు. .క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను అందుబాటులో ఉంచారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com