Jk: కశ్మీర్‌లో కొనసాగుతున్న వర్ష బీభత్సం.. 11 మంది మృతి..నలుగురి గల్లంతు

జమ్మూ కశ్మీరులో సంభవించిన తాజా మేఘ విస్ఫోటాలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులతో సహా 11 మంది మరణించారు. రియాసీ జిల్లాలో శుక్రవారం ఓ ఇంటిపైన కొండ చరియలు విరిగిపడడంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు మరణించారు. రాంబన్‌లోని పర్వత ప్రాంతమైన రాజ్‌గఢ్‌లో మేఘ విస్ఫోటం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు గల్లంతయ్యారు. అనేక ఇళ్లు ధ్వంసం కాగా కొన్ని కొట్టుకుపోయాయి. సెప్టెంబర్ 2 వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించడంతో రాంబన్ జిల్లా యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసింది.
సహాయక చర్యల్లో పాల్గొని ఓ అగ్నివీరుడు ప్రాణాలు వదలిన ఘటన జమ్మూ డివిజన్‌లోని అఖ్నూర్ జిల్లాలో ఆగస్టు 26న చోటుచేసుకుంది. ఈసందర్భంగా శనివారం ఆ అగ్నివీరుడి మృతదేహాన్ని సైనిక లాంఛనాలతో వారి స్వగ్రామానికి పంపించారు. అమరవీరుడైన సైనికుడు మణిపూర్‌కు చెందిన జిమ్మీ గమిన్‌లున్ మేట్ అని తెలిపారు. ఈ వీర సైనికుడు ఆగస్టు 26న అఖ్నూర్‌లో వరదల సమయంలో, చీనాబ్ నది ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో సహాయక చర్యల్లో పాల్గొని నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.
దేశాన్ని రక్షించడానికి పర్గల్‌లో మరో ధైర్యవంతుడైన అగ్నివీరుడు ప్రాణాలను వదిలాడని ఆర్మీ అధికారులు తెలిపారు. అంతకుముందు BSF 195 బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ రాజిబ్ నునియా కూడా మరణించారు. తాజాగా మరణించిన అగ్నివీరుడు జిమ్మీ గామిన్‌లున్ మేట్ అస్సాంలోని సిల్చార్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అదే సమయంలో జమ్మూలోని రాంబన్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా ముగ్గురు మరణించారు. రియాసి జిల్లాలోని మహోర్‌లో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మరణించారు. సోమవారం నుంచి వరదలు, వర్షం, క్లౌడ్ బరస్ట్ కారణంగా ఇప్పటివరకు 54 మంది మరణించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com