Pune: వర్షం కారణంగా ఆగిన హిందూ వివాహం, రిసెప్షన్ వేదిక ఇచ్చిన ముస్లిం జంట ..

వర్షం ఓ హిందూ జంట పెండ్లికి ఆటంకం కలిగిస్తే ముస్లిం కుటుంబం మత సామరస్యం ఆ ఆటంకానికి పరిష్కారం చూపించి ఆదర్శంగా నిలిచింది. గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మే నెలలో వచ్చిన ఈ అకాల వర్షం చాలా మందిని గందరగోళానికి గురి చేసింది. ముందుగా అనుకున్న కార్యక్రమాలు నిలిచిపోయాయి. పూణేలో కొన్ని వివాహాల్లో జాప్యం చోటు చేసుకుంది. కానీ, ఈ కుండపోత వర్షం కారణంగా ఒక సానుకూల విషయం జరిగింది. వనవాడిలో జరిగిన ఒక వివాహ వేడుక మతం కంటే మానవత్వం గొప్పదని నిరూపించింది. వర్షం కారణంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి వేరే మతానికి చెందిన కుటుంబం అకస్మాత్తుగా సహాయం అందించింది.
పూణేలోని వనవాడి ప్రాంతంలో మంగళవారం సాయంత్రం వర్షం కారణంగా హిందూ జంట వివాహం నిలిచిపోయింది. సంస్కృతి కవాడే, నరేంద్ర గలాండేల జంట వివాహం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో బహిరంగ పచ్చిక బయళ్లలో జరగాల్సి ఉంది. కానీ చివరి క్షణంలో భారీ వర్షం వల్ల మండపం తడిసి ముద్దయింది. దీంతో మొత్తం ఏర్పాట్లు అస్తవ్యస్తంగా మారాయి. ఇంతలో.. సమీపంలోని ఒక హాలులో ఓ ముస్లిం కుటుంబం రిసెప్షన్ జరుగుతోంది. హిందూ కుటుంబానికి చెందిన కొంతమంది పెద్దలు సహాయం ఆ ముస్లిం కుటుంబీకులను వేదిక కోసం అభ్యర్థించారు.
ముస్లిం కుటుంబం ఎటువంటి సంకోచం లేకుండా దాదాపు గంటసేపు వేదికను ఇచ్చింది. రెండు వర్గాల సహకారంతో వివాహ ఆచారాలు పూర్తయ్యాయని వధువు బంధువు శాంతారామ్ కవాడే తెలిపారు. మంగళాష్టకం, సాంప్రదాయ ఆచారాలతో వివాహం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ వివాహం తర్వాత.. రెండు వర్గాల ప్రజలు కలిసి భోజనం చేశారు. ఈ దృశ్యం పరస్పర సామరస్యం, సామాజిక ఐక్యతకు ఉదాహరణగా మారింది. మతం కారణంగా సమాజంలో ఉద్రిక్తతలు తలెత్తుతున్న వేళ ఇలాంటి సంఘటన అందరికీ ఆదర్శంగా నిలిచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com