Delhi Weather: ఢిల్లీని తాకిన వర్షాలు, భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాలైన (ఎన్సీఆర్) నోయిడా, ఘజియాబాద్‌లలో శుక్రవారం ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఉత్తర భారతదేశంపై క్రియాశీలకంగా ఉన్న పశ్చిమ కల్లోలం ప్రభావంతో ఈ మార్పులు చోటుచేసుకున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
గత ఏడేళ్లలో ఎన్నడూ లేనంతగా గురువారం ఢిల్లీలో 27.1 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అయితే, తాజా వర్షాలతో వాతావరణం చల్లబడింది. శుక్రవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 18-20 డిగ్రీలకు పడిపోతుందని, శనివారం నాటికి ఇది 16-18 డిగ్రీలకు మరింత తగ్గే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. రోజంతా ఒకటి, రెండు సార్లు వర్షాలు కురవచ్చని, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
ఈ వర్షాల కారణంగా 'చాలా పేలవం' (వెరీ పూర్) కేటగిరీలో ఉన్న ఢిల్లీ గాలి నాణ్యత సూచీ (AQI) మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వర్షానికి ముందు నోయిడాలో AQI 329, ఘజియాబాద్‌లో 347గా నమోదైంది. ఈ వాతావరణ ప్రభావం శనివారం ఉదయం వరకు కొనసాగవచ్చని, మళ్లీ జనవరి 26 నుంచి మరో పశ్చిమ కల్లోలం ఉత్తర భారతదేశంపై ప్రభావం చూపే అవకాశం ఉందని పీటీఐ తన కథనంలో పేర్కొంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
