RAIN: హిమాచల్, ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సం

ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు మళ్లీ ప్రకృతి ప్రళయాన్ని ఎదుర్కొంటున్నాయి. హిమాచల్‌లోని 10 జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. శిమ్లాలో ఐదు అంతస్తుల భవనం కూలిపోయినా, అందులోని నివాసితులను ముందుగానే ఖాళీ చేయించడంతో పెను ప్రమాదం తప్పింది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ కొండ ప్రాంతంలో ఇప్పటికే వందలాది భవనాలు ప్రమాదకరంగా మారినట్లు అధికారులు తెలిపారు.
రహదారుల మూసివేత
గత 24 గంటల్లో మూడు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందగా, రాష్ట్రవ్యాప్తంగా 129 రహదారులు మూసేశారు. మండీ, సిర్మౌర్, సోలన్ జిల్లాల్లో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. సోలన్‌లో ఓ వంతెన కొట్టుకుపోయింది. విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించడంతో విద్యార్థుల రాకపోకలపై ప్రభావం పడింది. ఈ ఏడాది వర్షాకాలం మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు వెల్లడించారు. గత ఏడాది ఈ సంఖ్య 550. ఇక ఉత్తరాఖండ్‌లో కూడా పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఆదివారం యమునోత్రి రహదారిలో కొండచరియలు విరిగిపడటంతో నిర్మాణంలో ఉన్న హోటల్ కుప్పకూలింది. ఏడుగురు గల్లంతయ్యారు. వారి కోసం రెస్క్యూ టీములు గాలింపు కొనసాగిస్తున్నాయి. నిషేధాన్ని తొలగించిన తర్వాత సోమవారం చార్ధామ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు, భద్రతా చర్యలు ముమ్మరంగా చేపట్టారు. వర్షాలు కొనసాగే అవకాశముండటంతో ప్రజలను అత్యవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో వారం రోజుల్లో రూ.29.16 కోట్ల నష్టం వాటిల్లింది. ప్రజా పనుల శాఖ (పిడబ్ల్యుడి) అత్యధికంగా రూ.2 కోట్ల 743.40 లక్షల నష్టం వాటిల్లింది. 6 ఇళ్లు పూర్తిగా ధ్వంసమవగా, 8 దెబ్బతిన్నాయి. 7 దుకాణాలు, 8 గోశాలలు కూడా నీటిలో కొట్టుకుపోయాయి. 37 జంతువులు, ఎన్నో పక్షులు కూడా కొట్టుకుపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 53 రోడ్లు ట్రాఫిక్ కోసం మూసివేశారు. 135 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, 147 తాగునీటి పథకాలు నిలిచిపోయాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com