CONGRESS: బయట పేపర్‌ లీకేజీ...లోపల వాటర్‌ లీకేజీ

CONGRESS: బయట పేపర్‌ లీకేజీ...లోపల వాటర్‌ లీకేజీ
X
పార్లమెంట్ లాబీలో వాటర్ లీక్ అవుతోన్న దృశ్యాలపై కాంగ్రెస్‌ విమర్శలు

ఢిల్లీ భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఈ వానల కారణంగా పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పార్లమెంట్ లాబీలో వాటర్ లీక్ అవుతోన్న దృశ్యాలను కాంగ్రెస్ ఎక్స్ వేదికగా షేర్ చేసి, కేంద్రంపై విమర్శలు గుప్పించింది. ‘‘బయట పేపర్ లీక్‌.. లోపల వాటర్ లీక్ అంటూ హస్తం పార్టీ ఆరోపణలు గుప్పించింది. పార్లమెంట్ లాబీలో నీటి లీకేజీ జరిగిందని... ఏడాది క్రితం అందుబాటులోకి వచ్చిన కొత్త భవనంలోని సమస్యలను ఇది వెల్లడి చేస్తోందని కాంగ్రెస్‌ మండిపడింది. దీనిపై పార్లమెంట్‌లో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడతానని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగంగా నూతన పార్లమెంట్‌ భవనాన్ని నిర్మించారు. గత ఏడాది దీనిని ప్రారంభించారు.

మాణికం ఠాగూర్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కొత్త పార్లమెంట్ భవనం లోపల నీటి లీకేజీ కనిపించింది. పై కప్పు నుంచి నీరు కారుతుండడం, పడే నీరు వ్యాపించకుండా నేలపై బకెట్లు ఏర్పాటు చేయడం వీడియోలో చూడొచ్చు. వీడియోను పోస్ట్ చేసిన ఎంపీ మాణికం ఠాగూర్.. “బయట పేపర్ లీకేజీ, లోపల వాటర్ లీకేజీ. భవనం నిర్మాణం పూర్తయి.. ఒక సంవత్సరం అయ్యింది. లీకేజీ కారణంగా లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.” అని రాసుకొచ్చారు. ఇటీవలి నిర్మించిన పార్లమెంట్ లాబీలో నీటి లీకేజీ ఏర్పడిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత వీడియోను పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. ఈ కొత్త పార్లమెంట్‌ కంటే పాత పార్లమెంట్‌ బాగుందని పేర్కొన్నారు. పాత ఎంపీలు కూడా వచ్చి కలిసే అవకాశం ఉందడేదని.. కోట్లాది రూపాయలతో నిర్మించిన పార్లమెంట్‌లో కనీసం లీకేజీపై విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రతి కొత్త పైకప్పు నుంచి నీరు కారడం వారి ఆలోచనాత్మక రూపకల్పనలో భాగమా? అని ప్రజలు అడుగుతున్నారని అఖిలేష్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.

ఢిల్లీలో మరోసారి వర్షం బీభత్సంగా మారింది. బుధవారం సాయంత్రం నుంచి ఢిల్లీలో ప్రారంభమైన వర్షాలు రాత్రిపూట కొనసాగాయి. ఆ తర్వాత ఢిల్లీలోని సరితా విహార్, దర్యాగంజ్, ప్రగతి మైదాన్ సహా అనేక ప్రాంతాలు చెరువులుగా మారాయి. దీని ప్రభావం గురువారం ఉదయం కూడా కనిపించింది. ఈరోజు కూడా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రహదారులు నీట మునిగాయి. గురువారం ఉదయం నుంచి రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. వర్షం కారణంగా ఢిల్లీలో ఈరోజు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

Tags

Next Story