Rajasthan: తిందామని టిఫిన్ బాక్స్ తెరిచింది.. అంతలోనే గుండె ఆగింది..

Rajasthan: తిందామని టిఫిన్ బాక్స్ తెరిచింది.. అంతలోనే గుండె ఆగింది..
X
ఉపాధ్యాయులు ఆమెను సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లడంలో సమయం వృధా చేయలేదు. ప్రాచిని ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు, ఆమె గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని అక్కడ ఉన్న వైద్యులు NDTVకి తెలిపారు.

9 ఏళ్ల చిన్నారి గుండెపోటుకు గురై మరణించడం అత్యంత విషాదం. నాలుగు రోజుల నుంచి జ్వరం వస్తున్నా అమ్మా నాన్న మాట వినకుండా అయిదో రోజు పాఠశాలలో అడుగుపెట్టింది. స్నేహితులను మిస్ అవుతున్నాననుకుందో, టీచర్ పాఠం చెప్పినప్పుడు వినకపోతే మళ్లీ తరువాత అర్థం కావనుకుందో ఏమో.. పూర్తిగా తగ్గిన తరువాత వెళుదువు కానీ అన్నా వినకుండా స్కూలుకు వెళితే తగ్గిపోతుందిలే అని తల్లికి నచ్చ చెప్పి అమ్మ ఇచ్చిన లంచ్ బాక్స్ తీసుకుని బస్సెక్కింది. లంచ్ బ్రేక్ లో బాక్స్ ఓపెన్ చేసింది. కనీసం ఒక్క ముద్దైనా తినలేదు.. చిన్నారి గుండె ఆగింది. తిరిగి రాని లోకాలకు వెళ్లింది. అమ్మానాన్నలకు తీరని దు:ఖాన్ని మిగిల్చింది.

రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో 9 ఏళ్ల విద్యార్థిని ఆకస్మిక మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. మరణించిన బాలిక పేరు ప్రాచి కుమావత్. ప్రాచి మరణం గుండెపోటు కారణంగా జరిగి ఉండవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి.

ప్రాచి ఆదర్శ్ విద్యా మందిర్ అనే పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. జలుబు, జ్వరం కారణంగా ఆమె గత కొన్ని రోజులుగా పాఠశాలకు రావడం లేదు, కానీ సోమవారం తిరిగి వచ్చింది. ఆమె ప్రార్థన సమావేశానికి హాజరై, తరగతి గదిలో అప్పటి వరకు టీచర్ చెప్పిన క్లాసులు విన్నది. ఆ తరువాత లంచ్ సమయంలో, ఆమె టిఫిన్ తెరిచినప్పుడు, అకస్మాత్తుగా స్పృహ కోల్పోయింది.

గమనించిన టీచర్ వెంటనే చిన్నారిని సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లింది. ప్రాచిని ఆసుపత్రికి తీసుకువచ్చేటప్పటికే ఆమె గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని అక్కడ ఉన్న వైద్యులు తెలిపారు. ఆమెకు వెంటనే CPR, ఆక్సిజన్ మరియు అవసరమైన మందులు అందించారు. కానీ ఆమె పరిస్థితి మరింత దిగజారుతూనే ఉంది.

దాదాపు గంటన్నర పాటు ఆమె ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నించిన తర్వాత, ఆమెను సికార్‌లోని ఒక ప్రధాన ఆసుపత్రికి పంపారు, కానీ మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. ఇది గుండె వైఫల్యం కావచ్చునని వైద్యులు అనుమానిస్తున్నారు. ప్రాచికి పుట్టుకతో వచ్చే గుండె జబ్బు ఏదైనా ఉందా అని ఆరా తీస్తున్నారు.

ప్రాచీ కుటుంబం పోస్ట్ మార్టంకు అంగీకరించలేదు. ప్రాచి ఎప్పుడూ ఎటువంటి పెద్ద అనారోగ్యంతో బాధపడలేదని వారు చెబుతున్నారు. ఆమె ఎప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండేదని, చదువులో కూడా చురుకైన అమ్మాయి. పాఠశాల రికార్డ్ చేసిన చివరి వీడియోలో, ప్రాచి నవ్వుతూ తనను తాను పరిచయం చేసుకుంటూ కనిపిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు ఒక చెరగని జ్ఞాపకంగా మారింది కుటుంబసభ్యులకు.

Tags

Next Story