Rajasthan : రాజస్థాన్ లో వసుంధర రాజే హవా

Rajasthan :  రాజస్థాన్ లో వసుంధర రాజే హవా
ఐదేళ్లకు మించి మాకెవరూ నచ్చరన్న రాజస్థాన్ ఓటరు

రాజస్థాన్‌లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. భారతీయ జనతా పార్టీ అధికారాన్ని దక్కించుకునే దిశగా పయనిస్తోంది. ఆరంభంలో కాంగ్రెస్‌- భాజపా హోరాహోరీగా తలపడినా ఆ తర్వాత కమలం పార్టీ భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. గతనెల 25న ఓటింగ్‌ జరిగిన 199స్థానాలకు ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా 4.36 లక్షల పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కించారు. మొత్తం 199నియోజకవర్గాలకు సంబంధించి 66 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటివరకూ భారతీయ జనతా పార్టీ... కాంగ్రెస్‌ పార్టీ కంటే ముందంజలో ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఓట్లలెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. భాజపా గెలుపుతో కమలం శ్రేణుల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.

కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో సీఎం అశోక్ గహ్లోత్, మంత్రులు ప్రతాప్ సింగ్ ఖచరియావాస్, టికారమ్ జుల్లీ, శకుంతలా రావత్, బ్రిజేంద్ర ఓలా, విశ్వేంద్ర సింగ్, మహేంద్ర జీత్ సింగ్ మాల్వియా ముందంజలో ఉన్నారు. శాంతి ధరివాల్, స్పీకర్ సీపీ జోషి వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి సచిన్‌ పైలట్‌ ముందంజలో ఉన్నారు. భాజపా నేత, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఝల్రాపటన్‌ అసెంబ్లీ స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. తొమ్మిది మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ముందంజలో ఉన్నారు.

రాజస్థాన్‌లో మొత్తం 2వందల శాసనసభ స్థానాలు ఉన్నప్పటికీ కరణ్‌పుర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి గుర్మిత్‌సింగ్‌ హఠాన్మరణం చెందటంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. దీంతో 199 స్థానాలకు ఓటింగ్‌ జరిగింది. రాజస్థాన్‌లో మొత్తం 33జిల్లాలు ఉండగా జయపుర, జోథ్‌పుర్‌, నాగౌర్‌లో 2 చొప్పున, మిగితా జిల్లాల్లో ఒకటి చొప్పున ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 51వేల 8వందల 96 పోలింగ్‌ కేంద్రాల్లోని EVMల కోసం 2వేల 5వందల 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. షియో నియోజకవర్గానికి సంబంధించి 41రౌండ్లు, దక్షిణ అజ‌‌్ మేర్‌లో 14రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల ఫలితాలను సకాలంలో ప్రకటించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు....రాజస్థాన్‌ ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు.

రాజస్థాన్‌లో ఐదేళ్లకోసారి అధికారం మారే సంప్రదాయం ఈసారి కూడా కొనసాగుతుందని ఇప్పటికే ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. కాంగ్రెస్‌ మాత్రం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాలే తమను విజయతీరాలకు చేరుస్తాయని ఆ పార్టీనేతలు అంటున్నారు.

Next Story