Rajasthan: పని చేయకుండానే ఆ ప్రభుత్వాధికారి భార్యకు రూ.37లక్షల జీతం

Rajasthan: పని చేయకుండానే ఆ ప్రభుత్వాధికారి  భార్యకు రూ.37లక్షల జీతం
X
రాజస్థాన్‌‌లో ఘరానా మోసం

ఎటువంటి పని చేయకుండానే ఓ అధికారి భార్య రెండు సంస్థల నుంచి రూ.37 లక్షల జీతం పొందిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని రాజ్‌కంప్‌ ఇన్ఫో సర్వీసెస్‌లో ఐటీ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ ప్రద్యుమ్నా దీక్షిత్‌ అనే అధికారి భార్య ఏ పని చేయకుండానే లక్షల రూపాయల జీతాన్ని పొందిందని ఆరోపిస్తూ.. ఓ వ్యక్తి రాజస్థాన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఓరియన్‌ ప్రో సొల్యూషన్స్‌, ట్రీజెన్‌ సాఫ్ట్‌వేర్‌ లిమిటెడ్‌ సంస్థలకు ప్రభుత్వ టెండర్లు ముట్టజెప్పినందుకు గాను ఐటీ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ ప్రద్యుమ్నా దీక్షిత్ తన భార్యను ఆయా కంపెనీలలో ఉద్యోగిగా నియమించుకోవాలనే షరతు పెట్టాడు. అందుకు అంగీకరించిన ఆ సంస్థలు వారి వద్ద ప్రద్యుమ్నా దీక్షిత్‌ భార్య పూనమ్‌ దీక్షిత్‌ పని చేస్తున్నట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించారు. దీంతో రెండేళ్లుగా ఆమెకు ఆయా కంపెనీల నుంచి నెలవారీ జీతం అందుతోంది. రెండేళ్ల పాటు రెండు కంపెనీలు ఆమెకు మొత్తం రూ.37లక్షల వేతనాన్ని అందించాయి.

ఈ విషయంపై దర్యాప్తు చేయాలని రాజస్థాన్ హైకోర్టు అవినీతి నిరోధక బ్యూరో (ACB)కు ఆదేశాలు ఇవ్వడంతో ఈ ఏడాది జులై 3న అధికారులు విచారణ ప్రారంభించారు. దర్యాప్తులో ఓరియన్‌ ప్రో సొల్యూషన్స్‌, ట్రీజెన్‌ సాఫ్ట్‌వేర్‌ లిమిటెడ్‌ సంస్థల ఉద్యోగిగా పేర్కొంటూ.. 2019 సెప్టెంబర్, 2020 మధ్య పూనమ్‌ దీక్షిత్‌కు చెందిన ఐదు బ్యాంకు ఖాతాలకు జీతం మొత్తం రూ.37 లక్షలు బదిలీ అయినట్లు తేలింది. అయితే ఈ రెండేళ్లలో ఆమె ఒక్కరోజు కూడా ఆ కంపెనీలకు వెళ్లలేదని అధికారులు గుర్తించారు. పూనమ్‌ దీక్షిత్‌ ఆయా కంపెనీలలో పని చేస్తున్నట్లు తెలిపే నకిలీ హాజరు నివేదికలకు ప్రద్యుమ్నా దీక్షిత్‌ స్వయంగా ఆమోదం తెలిపినట్లు అధికారులు పేర్కొన్నారు.

Tags

Next Story