Rajasthan: సంప్రదాయానికే జై.. రాజపుత్రుల కోటలో కాషాయ రెపరెపలు

Rajasthan: సంప్రదాయానికే జై.. రాజపుత్రుల కోటలో కాషాయ రెపరెపలు
30ఏళ్ల ఆనవాయితీనే కొనసాగించిన ఓటర్లు

రాజస్థాన్‌లో భారతీయ జనతా పార్టీ అధికారం కైవసం చేసుకుంది. రాజపుత్రుల కోటలో 199 శాసనసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 114 స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయం సాధించింది. అయిదేళ్లకు ఒకసారి ప్రభుత్వ మార్పు సంప్రదాయానికే రాజస్థాన్‌ ఓటర్లు జై కొట్టిన వేళ అధికార కాంగ్రెస్‌ పార్టీ కేవలం 71 స్థానాలకే పరిమితం అయింది. ఇతరులు 14 స్థానాల్లో విజయం సాధించారు. వసుంధర రాజే, సచిన్‌ పైలెట్‌, అశోక్‌ గహ్లోత్ వంటి ఉద్ధండులు విజయం సాధించారు. కమల పార్డీ వికాసంతో భాజపా శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి.

రాజస్థాన్‌ ఓటర్లు సంప్రదాయానికే పట్టం కట్టిన వేళ రాజపుత్రుల కోటపై కమలం జెండా ఎగిరింది. రాజస్థాన్‌లో హోరాహోరీ తప్పదన్న.. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మెజార్టీతో అధికారాన్ని హస్తగతం చేసుకుంది.

ఒకే విడతలో 199 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ వంద స్థానాలు కాగా భాజపా 114 స్థానాలు కైవసం చేసుకుని తిరుగులేని మెజార్టీ సాధించింది. కాషాయ శ్రేణుల దూకుడుతో అధికార కాంగ్రెస్‌ పార్టీ.. కేవలం 71 స్థానాలకే పరిమితమైంది. భాజపా గాలిలో పలువురు మంత్రులు కొట్టుకుపోయారు. విపత్తు నిర్వహణ మంత్రి గోవింద్‌రామ్ మేఘ్వాల్ శకుంతలా రావత్, విశ్వేంద్ర సింగ్, రమేష్ చంద్ మీనా, షేల్ మహ్మద్, ఉదయలాల్ అంజన, బిడి కల్లా, జహిదా ఖాన్ సహా పలువురు మంత్రులు.... పరాజయం పాలయ్యారు. భాజపా నేత, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఝల్రాపటన్‌ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. జుత్వారా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన కేంద్ర మంత్రి రాజ్యవర్దన్‌ సింగ్‌ రాథోడ్‌ 50 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. భాజపా నుంచి విధ్యాద్‌నగర్‌ అసెంబ్లీ నుంచి దియా కుమారి, పింద్వారా నుంచి సమరం, మనోహర్‌ థానా నుంచి గోవింద్‌ ప్రసాద్‌, బెహ్రోర్‌ నుంచి జస్వంత్‌ సింగ్‌ యాదవ్‌, జామ్వా రామ్‌గఢ్‌ నుంచి మహేంద్ర పాల్‌ మీనా గెలుపొందారు.

కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో సీఎం అశోక్ గహ్లోత్, మంత్రులు ప్రతాప్ సింగ్ ఖచరియావాస్, టికారమ్ జుల్లీ, శకుంతలా రావత్, బ్రిజేంద్ర ఓలా, విశ్వేంద్ర సింగ్, మహేంద్ర జీత్ సింగ్ మాల్వియా గెలుపొందారు. కాంగ్రెస్‌ అభ్యర్థి సచిన్‌ పైలట్‌ కూడా విజయం సాధించారు. కాంగ్రెస్‌, భాజపా నుంచి రెబల్‌ అభ్యర్థులుగా బరిలోకి దిగిన 14 మంది స్వతంత్రులు కూడా విజయం సాధించారు.

రాజస్థాన్‌లో మొత్తం 2వందల శాసనసభ స్థానాలు ఉన్నప్పటికీ కరణ్‌పుర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి గుర్మిత్‌సింగ్‌ హఠాన్మరణం చెందటంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. దీంతో 199 స్థానాలకే ఓటింగ్‌ జరిగింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ వంద స్థానాల్లో, భాజపా 73 సీట్లు గెలుపొందాయి. ఈసారి భాజాపా 114 స్థానాలు సాధించగా.. కాంగ్రెస్‌ 71 స్థానాలకు పరిమితమైంది. భాజపా విజయంతో కమలం శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి.

Tags

Next Story