తలైవా ఎంట్రీ.. ఎవరికి మూడిందో!

తలైవా ఎంట్రీ.. ఎవరికి మూడిందో!
రజినీకాంత్ వచ్చేస్తున్నారు. రాజకీయరంగం ప్రవేశం కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అభిమానులకు కబాలి తియ్యని కబురు పంపారు. జనవరిలో పార్టీని..

రజినీకాంత్ వచ్చేస్తున్నారు. రాజకీయరంగం ప్రవేశం కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అభిమానులకు కబాలి తియ్యని కబురు పంపారు. జనవరిలో పార్టీని స్థాపిస్తున్నానంటూ ట్విట్టర్ ప్రకటన చేశారు. 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నానంటూ చెప్పేశారు. రెండురోజుల్లో ప్రకటన చేస్తానన్న రజినీ.. అన్నట్టుగానే పార్టీపై ఓ ప్రకటన చేశారు. డిసెంబర్ 31న పూర్తి వివరాలు వెల్లడిస్తానంటూ టీజర్ వదిలారు. అసలు సినిమా మాత్రం జనవరిలో ఉంటుందని డేట్ ఫిక్స్ చేశారు. అంతా సమూలంగా మార్చేద్దాం.. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదంటున్నారు రజనీకాంత్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని.. నిజాయతీ, పారదర్శక, అవినీతిరహిత, ఆధ్యాత్మిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్ ప్రకటన తమిళరాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది...

డిసెంబర్ 31కి, రజినీకాంత్‌కి ఏదో సంబంధం ఉన్నట్టుంది. మూడేళ్ల క్రితం..అంటే 2017 డిసెంబర్ 31న అతి త్వరలో రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. 50 ఏళ్లుగా తమిళ ప్రజలు రెండు పార్టీలతో విసిగిపోయారని, మూడో ప్రత్యామ్నాయం అవసరం అని ఆనాడే ప్రకటించారు. ఆ తరువాత మూడేళ్ల పాటు అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ వచ్చారు. చివరికి త్వరలో పార్టీపై ప్రకటన చేస్తానంటూ మళ్లీ డిసెంబర్ 31 తేదీనే ఎంచుకున్నారు...

ఇక రజినీ సీఎం అభ్యర్ధిగానే పోటీ చేయబోతున్నారనేది స్పష్టమవుతోంది. పార్టీ పెడతాను గాని, సీఎం కుర్చీలో కూర్చోను అంటూ ఆ మధ్య కామెంట్స్ చేసినా... దీనిపై అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. అయితే, రెండు రోజుల క్రితం సమావేశానికి వస్తున్నప్పుడు.. అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ పూల వర్షం కురిపించారు. ఆ సమయంలో ఆ నినాదాలను ఆస్వాదిస్తూ, స్వాగతించారే తప్ప.. వారిని వారించడం చేయలేదు. దీంతో సీఎం కుర్చీనే టార్గెట్‌గా పాలిటిక్స్‌లోకి దిగుతున్నట్టు సంకేతం ఇచ్చారు. మరోవైపు.. రజినీ రాజకీయాల్లోకి రావడం ఇతర పార్టీలకు పెద్ద కుదుపు వంటిదే. అసలే అన్నాడీఎంకే అట్టట్ట అన్నట్టుగా ఉంది. ఇందులోని ముఖ్య నేతలు తువ్వాలు నడుముకి కట్టుకుని రజినీ ఇంటి ముందు వాలినా వాలతారు. అళగిరి వచ్చినా, రాకపోయినా డీఎంకే కూడా చీలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా రజినీ పార్టీ తమిళ రాజకీయాల్లో భూకంపాన్నే సృష్టించనుంది.

Tags

Next Story